రావిర్యాల భూమాయ
ABN , Publish Date - Nov 07 , 2026 | 03:50 AM
నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ఆ జాబితా నుంచి తప్పించారు. ఎకరా రూ.91 లక్షల మార్కెట్ విలువతో గుట్టుచప్పుడు కాకుండా తమకు కావాల్సిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ వెంటనే భూమిని మళ్లీ 22ఏ జాబితాలో చేర్చారు.
భూభారతి పోర్టల్‌లో అధికారుల అక్రమాలు
తొలుత 22ఏ నుంచి తప్పించి ఎకరా
రూ.91 లక్షల చొప్పున రిజిస్ట్రేషన్
మర్నాడే భూమి విలువ అమాంతం
రూ.35.29 కోట్లకు పెంపు
బాధితులు న్యాయస్థానం మెట్లు ఎక్కకుండా చేసేందుకేనా?
నిలదీయడంతో రూ.1.19 కోట్లకు..
ఆపై రూ.60.90 లక్షలకు తగ్గింపు
రావిర్యాలలో 11.33 ఎకరాలపై
రెవెన్యూ అధికారుల బంతాట
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ఆ జాబితా నుంచి తప్పించారు. ఎకరా రూ.91 లక్షల మార్కెట్ విలువతో గుట్టుచప్పుడు కాకుండా తమకు కావాల్సిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ వెంటనే భూమిని మళ్లీ 22ఏ జాబితాలో చేర్చారు. మర్నాడే ఆ సర్వే నంబరులో ఎకరా విలువను ఏకంగా రూ.35 కోట్లకు పెంచారు. రిజిస్టర్ అయిన భూమిపై వివాదం ఉన్న రెండో పార్టీ నిలదీయడంతో కంగారుపడ్డారు. అదే రోజు ముందుగా ఎకరా విలువను రూ.1.19 కోట్లకు, కొద్దిసేపటికే రూ.60.90 లక్షలకు తగ్గించారు. ఇదేదో కనికట్టు కాదు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలోని సర్వే నంబరు 8 భూముల విషయంలో రెవెన్యూ అధికారులు సాగించిన వ్యవహారమిది. భూభారతి పోర్టల్‌ను ఏమార్చి భూమిని కట్టబెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ జరిపితే మరిన్ని విస్తుపోయే విషయాలు బయటపడతాయని చెబుతున్నారు
మూడు రోజులు.. నాలుగు విలువలు
రావిర్యాలలో సర్వే నంబరు 8, దాని ఉప సర్వే నంబర్లు 8/అ, 8/ఆ, 8/5, 8/6, 8/7, 8/8 రికార్డులను పరిశీలిస్తే అధికారుల తీరు బయట పడుతోంది. సర్వే నంబరు 8/5లోని 2.31 ఎకరాల రిజిస్ట్రేషన్ ఎకరా రూ.91 లక్షల విలువతో జరిగింది. మర్నాడు, ఈ నెల 3న, అదే సర్వే నంబర్ భూమి మార్కెట్ విలువను ఎకరా రూ.35,29,81,500 (రూ.35.29 కోట్లు)గా నిర్ణయించారు. 4న ఉదయం 11 గంటలకు దాన్ని రూ.1,19,70,000కు (రూ.1.19 కోట్లు) మార్చారు. కొద్దిసేపటికే రూ.60,90,000కు (రూ.60.90 లక్షలు) తగ్గించారు. అంటే చివరికి నిర్ణయించిన విలువ రిజిస్ట్రేషన్ జరిగిన విలువ కంటే కూడా తక్కువ. ఒకే గ్రామంలో, ఒకే సర్వే నంబరు పరిధిలోని భూమికి ఇంత వ్యత్యాసం ఎందుకని భూయజమానులు ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం లేదు. ఇది సాంకేతిక లోపం కాదని, స్వప్రయోజనాల కోసమే విలువలు మార్చారని బాధితులు ఆరోపిస్తున్నారు.
కోర్టుకు వెళ్లకుండా చేసేందుకేనా?
రిజిస్ట్రేషన్ జరిగిన భూమి మళ్లీ చేతులు మారకుండా, ఎవరూ న్యాయపోరాటం చేయకుండా చూడటానికే మర్నాడు విలువను రూ.35 కోట్లకు పెంచారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లాలంటే పెంచిన విలువ ఆధారంగానే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కోర్టుకు వెళ్లకుండా అడ్డుకునేందుకే ఇలా పెంచారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్నది అధికారులే చెప్పాలి. భూమిపై వివాదం నడుపుతున్నవారు ‘ఎకరా రూ.35 కోట్లు ఎలా అవుతుంది?‘ అని నిలదీయడంతో గంటల వ్యవధిలోనే రెండుసార్లు విలువ తగ్గించారు.
కోర్టు ఉత్తర్వులు బేఖాతరు
ఈ భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయి. వీటిపై 1990 నుంచి న్యాయ వివాదాలు నడుస్తున్నాయి. 1990లో డాక్యుమెంట్ నంబరు 942/1990 ద్వారా భూమిని కొనుగోలు చేసినట్లు పిటిషనర్లు పేర్కొంటున్నారు. 2005లో 3812/2005, 3813/2005 డాక్యుమెంట్ల ద్వారా విక్రయాలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2006లో ఆర్డీవో, 2007లో జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి నివేదికలు ఇచ్చారు. 2024లో సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది హైకోర్టులో పలు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇన్ని చిక్కులు ఉన్నా మహేశ్వరం మండల రెవెన్యూ అధికారులు భూములు 22ఏ జాబితాలో లేవంటూ రిజిస్ట్రేషన్‌లు అనుమతించారు. 11.33 ఎకరాలు చేతులు మారాయి. ఒక్కొక్కరి పేరిట 2.31 ఎకరాల చొప్పున బదిలీ చేసి పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు.
అధికారం లేకున్నా మార్పులు
భూభారతి పోర్టల్‌లో పట్టాదారు వివరాలు, ఖాతా, సర్వే నంబర్లు, విస్తీర్ణం, వర్గీకరణ, మార్కెట్ విలువల్లో ఏది మార్చాలన్నా కలెక్టర్ సిఫార్సు, సీసీఎల్‌ఏ అనుమతి తప్పనిసరి. కోర్టు కేసులు ఉన్న భూముల్లో కోర్టు ఉత్తర్వులకు లోబడే మార్పులు చేయాలి. డిజిటల్ రికార్డులు మార్చే అధికారం మండల స్థాయి అధికారులకు లేదు. అయినా వారే మార్కెట్ విలువలు మార్చారని, నిషేధిత భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి అనుమతించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
నాకు తెలియకుండానే నా భూమి బదిలీ: చింతల మురళీధర్ రెడ్డి
‘సర్వే నంబరు 8/అ పరిధిలో మాకు 6 ఎకరాల 4 గుంటల భూమి ఉంది. ఏడేళ్ల క్రితం మా నాన్న చింతల నర్సింహారెడ్డి నుంచి వారసత్వంగా వచ్చింది. మహేశ్వరం తహసీల్దారు మాకు నోటీసులు ఇవ్వకుండా, మాకు తెలియకుండా దాన్ని ఇతరుల పేరిట మార్చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై చర్యలు తీసుకోవాలి‘ అని బాధితుడు చింతల మురళీధర్ రెడ్డి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News