Share News

రత్నదీప్‌, అక్షయ కల్పా ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు భారీ జరిమానా

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:03 AM

కలుషిత వెన్న విక్రయించిన కేసులో సైనిక్‌పురిలోని రత్నదీప్‌ రిటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు తయారీ సంస్థ అక్షయ కల్పా ఫార్మ్స్‌ అండ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్‌ భారీ జరిమానా విధించింది.

రత్నదీప్‌, అక్షయ కల్పా ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు భారీ జరిమానా
Ratnadeep

  • కలుషిత వెన్న విక్రయించడంపై వినియోగదారుల కమిషన్‌ ఆగ్రహం

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): కలుషిత వెన్న విక్రయించిన కేసులో సైనిక్‌పురిలోని రత్నదీప్‌ రిటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు తయారీ సంస్థ అక్షయ కల్పా ఫార్మ్స్‌ అండ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్‌ భారీ జరిమానా విధించింది. వినియోగదారురాలికి రూ.లక్ష పరిహారం, రూ.లక్ష జరిమానా, రూ.10 వేలు కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. వెన్న కొనుగోలు కోసం చెల్లించిన రూ.230 కూడా తిరిగి ఇవ్వాలని తీర్పునిచ్చింది. కాప్రాకు చెందిన సంధ్య గత ఏడాది జనవరి 28న రూ.230 చెల్లించి అక్షయ కల్పా ఆర్గానిక్‌ కుకింగ్‌ బటర్‌ను కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి ప్యాకెట్‌ తెరిచి చూడగా బూజు, కంటికి కనిపించే స్థాయిలో కలుషిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించి దుకాణ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.


సరైన స్పందన రాకపోవడంతో తయారీ సంస్థను, సంబంధిత అధికారులను ఆశ్రయించారు. దుకాణంలో సిఫారసు చేసిన నిల్వ ఉష్ణోగ్రతను నిర్వహించలేకపోతున్నట్లు తయారీ సంస్థ తనిఖీలో గుర్తించినట్టు కమిషన్‌ పేర్కొంది. వెన్నను 4డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలని, క్లోజ్డ్‌ కూలింగ్‌ ఏర్పాటు చేయాలని, సిబ్బందికి కోల్డ్‌ చైన్‌ నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తాము కేవలం విక్రయదారులమని రత్నదీప్‌ సంస్థ, ఫిర్యాదు అందిన తర్వాత తనిఖీలు నిర్వహించి అవసరమైన సూచనలు ఇచ్చామని అక్షయ కల్పా సంస్థ వాదించాయి. అయితే ఉత్పత్తి నాణ్యతను కాపాడటంలో రెండు సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని కమిషన్‌ నిర్థారించింది. కలుషిత ఆహార పదార్థాల విక్రయం విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులను హైదరాబాద్‌ ఫోరం-2 ప్రెసిడెంట్‌ వక్కంటి నర్సింహారావు, సభ్యులు పీవీటీఆర్‌ జవహర్‌బాబు, వాల సుమలతో కూడిన బెంచ్‌ ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 06:03 AM