Share News

తెలంగాణ సాధనకు బాపూ జీవితం అంకితం

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:00 AM

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం కొనసాగుతోందని పేర్కొన్నారు.

తెలంగాణ సాధనకు బాపూ జీవితం అంకితం
Ponnam Prabhakar

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌

  • కొండా లక్ష్మణ్‌ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి: దత్తాత్రేయ

హైదరాబాద్‌ సిటీ, రవీంద్రభారతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.


తెలంగాణ పద్మశాలి కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరు శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, ఆత్మీయ అతిథులుగా ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్‌, పలు కార్పొరేషన్ల చైర్మన్లు దూడెం వెంకటరమణ, జక్కని అనిత, అనిల్‌కుమార్‌, మెట్టు సాయికుమార్‌, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తదితరులు హాజరై కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి నివాళి అర్పించారు.


ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. పదవులు, రాజకీయ భవిష్యత్తు కంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇచ్చిన త్యాగశీలి బాపూజీ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఐదుగురు పద్మశాలీ ఎమ్మెల్యేలు గెలవాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రి వివేక్‌ మాట్లాడుతూ. స్వరాష్ట్రం కోసం పలు త్యాగాలు చేసిన గొప్ప నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని కొనియాడారు. కాగా బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో జలదృశ్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌ బాపూజీకి భారతరత్న ఇవ్వడమే సరైన నివాళి అన్నారు.


చేనేత రంగం అభివృద్ధికి ఆయన చేసిన సేవలు గణనీయమైనవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ కోసం రాజీ లేని పోరాటం చేశారని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ .. ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నివాళులు అర్పించారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం సాధించే వరకు తమ ఉద్యమం నిరంతరం కొనసాగుతుందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్‌ పేర్కొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్లస్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాధం, బీసీ రాజ్యాధికార సమితి సీఈఓ పోశాల సరస్వతి, పద్మశాలి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మన్మోహన్‌ పేరుతో యూనివర్సిటీ పెట్టాం

రాష్ట్ర ప్రజలు ఓట్లేసి సీఎంను చేస్తే.. సోనియా కుటుంబం కోసం ప్రాణాలిస్తారా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 06:00 AM