కల్తీ నూనెలు, గోధుమ పిండి తయారీ.. తండ్రీకొడుకుల అరెస్ట్
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:15 PM
గచ్చిబౌలిలో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి తండ్రీకొడుకులు ఇద్దరినీ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, మార్చి 9: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ నూనెలు, గోధుమ పిండి తయారీ ముఠా గుట్టు రట్టైంది. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో తండ్రీ, కొడుకులను అరెస్టు చేశారు. వట్టినగులపల్లి ఇందిరమ్మ కాలనీలోని శ్రీ జస్నాత్ ట్రేడర్స్ దుకాణంపై ఎస్వోటీ పోలీసులు ఈరోజు(సోమవారం) దాడి చేశారు.
గడువు ముగిసిన వివిధ కంపెనీల వంట నూనెలను సేకరించి, సోయాబీన్ నూనెతో కలిపి కల్తీ వంట నూనెను నిందితులు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలా తయారైన నూనెను వివిధ ప్రసిద్ధ బ్రాండ్ల పేర్లతో ప్యాక్ చేసి మార్కెట్‌లో అమ్ముతున్నట్లు దాడుల్లో బయటపడింది. అదే విధంగా గడువు తీరిన గోధుమ పిండిని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి... 'జస్నాత్ గోల్డ్ చక్కి అట్టా' పేరుతో తిరిగి ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రైడ్‌లో సుమారు 10 లక్షల రూపాయల విలువైన 5,026 లీటర్ల కల్తీ వంట నూనె, 3 లక్షల రూపాయల విలువైన 5,192 కిలోల గోధుమ పిండిని స్వాధీనం చేసుకున్నారు.
వెయిటింగ్ మెషిన్, ఆయిల్ ఫిల్టర్ మెషిన్, గోధుమ ఫిల్టర్ మెషిన్‌తో పాటు ఇతర సామాగ్రిని కూడా సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ సుమారు 21 లక్షల రూపాయలుగా అంచనా వేశారు. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన భన్వర్ రామ్ జాట్ (46), అతని కుమారుడు అశోక్ కుమార్‌లను అరెస్టు చేశారు. నిందితులను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఏపీ లిక్కర్ స్కామ్.. ఆ ముగ్గురికి ఈడీ నోటీసులు
నేను టూరిస్ట్‌ను కాదు.. వారికి అండగా నిలబడేందుకు వచ్చా: కవిత
Read Latest Telangana News And Telugu News