నేను టూరిస్ట్‌ను కాదు.. వారికి అండగా నిలబడేందుకు వచ్చా: కవిత
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:51 PM
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని.. ఇది ప్రభుత్వానికి మంచిది కాదని కవిత అన్నారు. వెలుగుమట్ల నిర్వాసితులకు అండగా నిలబడటానికి వచ్చానని తెలిపారు.
ఖమ్మం జిల్లా, మార్చి 9: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలతో నిర్వాసితులైన బాధిత కుటుంబాలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) ఈరోజు(సోమవారం) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడబిడ్డ దుఃఖం ఎవరికీ మంచిది కాదన్నారు. వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని.. ఇది ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు. ఈ దుఃఖాన్ని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేయటానికి ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు.
వెలుగుమట్ల నిర్వాసితులకు అండగా నిలబడటానికి వచ్చానని తెలిపారు. ‘నేను టూరిస్ట్‌ను కాదు... మీ సమస్యకు పరిష్కారం చూపేవరకూ పోరాడతా’ అని కవిత స్పష్టం చేశారు. గతంలో ఇళ్లు కూల్చటానికి బీఆర్ఎస్ వాళ్లు ప్రయత్నాలు చేశారన్నారు కవిత. జిల్లా కలెక్టర్ వచ్చి బాధితులతో మాట్లాడాలని... మంత్రులు వచ్చి బాధితులతో మాట్లాడి వారి సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఎక్కడైతే ఇళ్లు కూల్చారో అక్కడే స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టి ఇవ్వాలన్నారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపడం న్యాయం కాదని మండిపడ్డారు. పేదల పక్షాన నిలబడి సమస్యకు పరిష్కారం దొరికే వరకూ పోరాడతానని.. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని కవిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కాకినాడలో పెద్దపులి కలకలం.. అటవీ అధికారుల అలర్ట్
ఏపీ లిక్కర్ స్కామ్.. ఆ ముగ్గురికి ఈడీ నోటీసులు
Read Latest Telangana News And Telugu News