Share News

లడ్డూ కల్తీపై తప్పుడు ప్రచారం.. రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Mar 09 , 2026 | 02:35 PM

గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

లడ్డూ కల్తీపై తప్పుడు ప్రచారం.. రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
CM Chandrababu

నంద్యాల, మార్చి 9: శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) హెచ్చరించారు. సోమవారం డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటించారు. రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పాస్‌పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు ఉండటం ఏంటి అని ప్రశ్నించారు. ఇదేంటని అడిగితే బాధితులపైనే కేసులు పెట్టారని విమర్శించారు.


తప్పు జరగకుండా చూస్తాం..

వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నామని చెప్పారు. రికార్డులు తారుమారు చేయకుండా పకడ్బంధీగా పాస్‌పుస్తకాలు ఇస్తున్నామని, క్యూఆర్ కోడ్‌తో పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎవరు తప్పు చేసినా వెంటనే తెలుస్తుందన్నారు. ఒక్కపైసా కూడా అవినీతి లేకుండా పట్టా ఇప్పించే బాధ్యత తమదని స్పష్టం చేశారు. సమస్యలన్నీ పరిష్కరించాకే కొత్త పాక్‌ బుక్స్‌ ఇస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఎక్కడా తప్పులు జరగకుండా చూస్తామని సీఎం అన్నారు.


శ్రీవారి ప్రసాదాన్ని వదల్లేదు..

గత ఐదేళ్లు దుర్మార్గ పాలన సాగిందని సీఎం విమర్శించారు. ల్యాండ్ టైట్లింగ్‌ చట్టాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని సీఎం ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. సీబీఐ రిపోర్ట్ ఇచ్చినా లడ్డూ కల్తీపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలపై దృష్టి పెట్టానని సీఎం తెలిపారు.


ఇదే నా సంకల్పం...

కల్తీ మద్యంతో చాలా మంది చనిపోయేలా చేశారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవాతో తాగునీరు, కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చామని చెప్పారు. రాయలసీమలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలనేది తన సంకల్పమని పేర్కొన్నారు. మాజీ మంత్రి వివేకాను దారుణంగా చంపారని.. నాన్న లేరు చిన్నాన్న కూడా లేరంటూ డ్రామాలు ఆడారని సీఎం విమర్శించారు. నారాసుర రక్తచరిత్ర అంటూ తన చేతిలో కత్తి పెట్టారని ఆరోపించారు. జగన్ మాటలు నమ్మి 2019లో తనకు ఓటు వేయలేదని చెప్పారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు.


రైతే రాజు కావాలి..

డబ్బు మీద ఆశతో ఒక్కరి కంటే ఎక్కువ మందిని కనడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. పెద్ద కుటుంబానికి ఎక్కువ సహాయం చేసేలా పథకాలు తీసుకొస్తామన్నారు. రైతే రాజు కావాలని.. రైతు అప్పులపాలు కావడానికి వీల్లేదన్నారు. దీపం పథకం ద్వారా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. గత పాలనకు ఈ పాలనకు తేడా ఏంటో ప్రజలే గమనించాలన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్కొన్నారు.


కాగా.. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఫ్రూట్ కవర్ల వాడకం వల్ల పండ్లకు మంచి ధర లభిస్తుందని హార్టికల్చర్ అధికారులు తెలిపారు. దీనిపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. కవర్ తొడిగిన పండ్ల నాణ్యతను, కవర్ లేని పండ్ల నాణ్యతను సీఎం స్వయంగా పరిశీలించారు. జిల్లాలో మంచి రేట్లు రావడానికి వివిధ వెరైటీల పంటలను ప్రోత్సహించాలని సూచించారు. భూగర్భ జలాల స్థాయిలు పెరిగేలా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

రాజంపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం.. హాస్టల్ యజమానిపై కర్రలతో దాడి!

ఈడీ విచారణకు కృష్ణమోహన్ రెడ్డి.. ఏబీఎన్‌ను చూడగానే పరుగో పరుగు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 09 , 2026 | 03:17 PM