Share News

ఫోన్‌ ట్యాపింగ్ నిందితులకు శిక్ష పడాల్సిందే: ఎంపీ చామల కిరణ్ కుమార్

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:15 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. బంజారాహి‌ల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కిరణ్ స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు.

ఫోన్‌ ట్యాపింగ్ నిందితులకు శిక్ష పడాల్సిందే: ఎంపీ చామల కిరణ్ కుమార్
Chamala Kiran Kumar Reddy

హైదరాబాద్, జూన్ 6: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. బంజారాహి‌ల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కిరణ్ స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. గతంలో చామల ఫోన్‌ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలో కిరణ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల వ్యూహాలను పసిగట్టేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిట్ విచారణ అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. సిట్ ఈరోజు తనను బాధితుడిగా విచారణకు పిలిచిందని అన్నారు.


తాను మీడియా కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఫోన్‌ ట్యాప్ అయ్యిందని సిట్ అధికారులు చెప్పారని ఎంపీ తెలిపారు. ఆనాడు బీఆర్ఎస్ సొంత పార్టీ మంత్రుల ఫోన్‌లు కూడా ట్యాప్ చేసినట్లు తెలిపారు. ‘జులై 30న నా ఫోన్‌ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. జులై 30 నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు నా ఫోన్‌ ట్యాప్ అయింది’ అని ఎంపీ వెల్లడించారు. నిజాం పాలనలో నిజాం రాజు.. రజాకార్లపై కూడా ఇంతలా నిఘా పెట్టి వేధించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తన ఐఫోన్‌కి అలర్ట్ వచ్చిందని.. అయితే అది నార్మల్‌గా వచ్చే అలర్ట్ అని భావించినట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడే విషయాలన్నీ తెలుసుకునేవారన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్లే వాళ్లని ముందుగానే గుర్తించి బెదిరింపులకి పాల్పడినట్లు ఆరోపించారు.


తన ఫోన్ మాత్రమే కాదని... హరీశ్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ చామల సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ విషయం బీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసన్నారు. సొంత పార్టీ నేతల ఫోన్‌‌లను కూడా కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని.. అధికారం కోసం కేసీఆర్ ఏమైనా చేస్తారని దుయ్యబట్టారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నేతలు, కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేయించారన్నారు. ఫోన్‌ ట్యాప్ నిందితులకు శిక్ష పడుతుందని భావిస్తున్నట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభుత్వ భూములను కాపాడుతాం: కవిత

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 04:36 PM