Share News

పల్నాడు వాటర్‌గ్రిడ్‌ వద్ద టీఆర్‌ఎస్‌ ధర్నా

ABN , Publish Date - Nov 30 , 2026 | 05:02 AM

ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురిసౌత్‌ వద్ద ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పల్నాడు వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు వద్ద తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్‌) నాయకులు ఆదివారం ఆకస్మికంగా ధర్నా చేయటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పల్నాడు వాటర్‌గ్రిడ్‌ వద్ద టీఆర్‌ఎస్‌ ధర్నా

  • ఏపీ వాసులు అడ్డుకోవటంతో పరస్పర దాడులు.. ఉద్రిక్తత

  • టీఆర్‌ఎస్‌ నేతలను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు

  • దాడులు దుర్మార్గం: ఎక్స్‌లో కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌ /నాగార్జునసాగర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురిసౌత్‌ వద్ద ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పల్నాడు వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు వద్ద తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్‌) నాయకులు ఆదివారం ఆకస్మికంగా ధర్నా చేయటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాదాపు 50 మంది టీఆర్‌ఎస్‌ నాయకులు విజయపురిసౌత్‌కు వెళ్లి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఏపీకి చెందిన కొందరు అక్కడికి వచ్చి టీఆర్‌ఎస్‌ నాయకులపై దాడి చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఎదురుదాడి చేయటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో టీఆర్‌ఎస్‌ మహిళా నాయకులకు గాయాలయ్యాయి. మాచర్ల రూరల్‌ సీఐ వేణు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టీఆర్‌ఎస్‌ నేతలను విజయపురిసౌత్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనుమతి లేకుండా వచ్చి ఆందోళన చేసినందుకు 32 మందిపై కేసులు నమోదు చేశారు.


అనంతరం వారిని పోలీస్‌ భద్రత నడుమ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. తెలంగాణలో సమాచారం ఇవ్వకుండా ఏపీకి వెళ్లి ఆందోళన చేసినందుకు 40 మందిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతూ.. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎక్కడికైనా వెళ్లి ఉద్యమిస్తామని ప్రకటించారు. పల్నాడు వాటర్‌గ్రిడ్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన తమ పార్టీ నేతలపై దాడి చేశారని టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. దాడిని ఖండిస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ఏపీ అక్రమంగా కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే రేవంత్‌రెడ్డికి కనీసం సోయి లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ నీళ్లను ఏపీ సీఎంకు గురుదక్షిణగా ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు ఏపీ కంటే బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలే ఎక్కువగా ద్రోహం చేస్తున్నాయని టీఆర్‌ఎస్‌నాయకుడు సయ్యద్‌ ఇస్మాయిల్‌ ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!

ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 30 , 2026 | 05:03 AM