మిగిలింది 55 ఆస్తులే!
ABN , Publish Date - Sep 02 , 2026 | 08:26 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రెండో దశ విస్తరణలోని ఓల్డ్‌సిటీ కారిడార్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
వేగంగా ఓల్డ్‌సిటీ మెట్రో కారిడార్ పనులు
మొత్తం 888 ఆస్తుల్లో ఇప్పటి వరకు 833 సేకరణ
ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు
మరోవైపు ముమ్మరంగా కూల్చివేతలు
హైదరాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రెండో దశ విస్తరణలోని ఓల్డ్‌సిటీ కారిడార్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నిర్మాణంలో భాగంగా కావాల్సిన భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరింది. మరో 55 ప్రభావిత ఆస్తులను తీసుకుంటే కారిడార్ నిర్మాణానికి అడుగులు పడినట్లవుతుందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) అధికారులు చెబుతున్నారు. నగరంలో రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా కారిడార్-6 కింద ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట వరకు (7.5 కిలోమీటర్లు) నిర్మాణాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాతిపదికన రూ.2,741 కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నాయి. అయితే నాగోల్ - శంషాబాద్ ఎయిర్‌పోర్టు (36.8 కిలోమీటర్ల) మార్గం తర్వాత పాతనగరం కారిడార్‌పైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ‘ఇది ఓల్డ్‌సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సభల్లో చెబుతూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ మార్గంలోని పనులను ప్రారంభించేందుకు ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా, ఫలక్‌నుమా ఆర్టీసీ ప్రాంగణంలో 2024 మార్చి 8న శంకుస్థాపన చేశారు.
పరిహారం.. వెంటనే తొలగింపు
ఇప్పటివరకు సేకరించిన ఆస్తుల్లో 60 శాతం కమర్షియల్ భవనాలు, 40 శాతం నివాస గృహాలున్నాయి. అయితే సేకరించిన ఆస్తులకు సంబంధించిన యజమానులకు పరిహారం అందిస్తున్న అధికారులు వెంటవెంటనే తొలగింపు పనులు చేపడుతున్నారు. ఆయా దారుల్లో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తూ పొక్లెయినర్లతో తొలగిస్తూ శిథిలాలను దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు విద్యుత్ స్తంభాలు, వాటర్‌పైపులకు ప్రమాదం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, తొలగింపు పనులను వివిధ శాఖల అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
సింగిల్ టెండర్‌తో జీసీ రద్దు
ఓల్డ్‌సిటీ కారిడార్ నిర్మాణంలో భాగంగా జనరల్ కన్సల్టెంట్ (జీసీ) నియామకమయ్యే ఇంజనీరింగ్ కన్సల్టెంట్ నుంచి సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదనలను గత జూన్‌లో ఆహ్వానించారు. టెండర్‌లో ఎంపికైన జీసీ రోజువారీగా అథారిటీ, దాని కాంట్రాక్టర్లు, ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఇతర సంస్థలతో సంబంధాలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే కేటాయింపు ద్వారా ఉత్పన్నమయ్యే సమాచారం, డిజైన్ డాక్యుమెంటేషన్, పని ప్రవాహా లను నిర్వహించాలి.
వీటితోపాటు ప్రాజెక్టు మైలురాళ్లకు కట్టుబడి ఉండేందుకు, పనులకు ప్రాధాన్యత ఇవ్వడంలో హెచ్‌ఏఎంఎల్‌కు సాయం చేయాలి. ప్రధానంగా నిర్మాణ సమయంలో తలెత్తే సమస్యలపై సలహాలు, సూచనలు ఇవ్వాలి. వీటితో పాటు స్థానిక ఇబ్బందులను, వివాదాలను పరిష్కరించేందుకు తోడ్పాటునందించాలి. కాగా, జనరల్ కన్సల్టెంట్‌కు సంబంధించిన అన్ని సాంకేతిక, ఆర్థిక, కాంట్రాక్ట్ నిర్వహణ అధికారాలు హెచ్‌ఏఎంఎల్ ద్వారా వినియోగించబడుతాయి.
జీసీ తన సేవల పరిధిలోకి వచ్చే అన్ని విషయాలపై హెచ్‌ఏఎంఎల్ ఆమోదాన్ని పొందాలి. కాగా, నియామకమైన జీసీ మూడు నెలల్లోగా తాను తయారు చేసిన డిజైన్ ప్రతిపాదనలను అందించాల్సి ఉంటుంది. అయితే టెండర్లలో కేవలం ఒకే సంస్థ తక్కువ కోట్ చేసి రావడంతో అధికారులు దానిని అనివార్యంగా రద్దు చేశారు. ఈ మేరకు మరోసారి టెండర్ల ఆహ్వానానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News