ఆయిల్‌పామ్ అ‘ధర’హో
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:37 AM
రాష్ట్రంలో ఆయిల్ పామ్(పామాయిల్ గెలల) ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. దేశ పామాయిల్ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా.. ఆగస్టు నెలలో టన్ను గెలల ధర రూ.24,050కు పెరిగింది.
టన్ను గెలల రేటు రూ.24,050.. దేశంలోనే అత్యధికం
ఆగస్టులో రికార్డు స్థాయికి చేరిన ధర.. రైతుల హర్షం
అశ్వారావుపేట, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆయిల్ పామ్(పామాయిల్ గెలల) ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. దేశ పామాయిల్ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా.. ఆగస్టు నెలలో టన్ను గెలల ధర రూ.24,050కు పెరిగింది. ఈ మేరకు మంగళవారం టీఎస్ ఆయిల్‌ఫెడ్ ప్లాంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు ప్రకటించిన ధరల్లో ఇదే అత్యధికమని ఆయిల్‌ఫెడ్ వర్గాలు తెలిపాయి. గత జూలైలో టన్ను ధర రూ.23,488 ఉండగా.. ఆగస్టులో మరో రూ.500 పెరిగి రూ.24,050కు చేరడంతో రైతుల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 3,14,500ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు సాగవుతుండగా, అందులో 1,18,354 ఎకరాల్లో దిగుబడులు వస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 3,45,000 మెట్రిక్ టన్నుల గెలలను క్రషింగ్ చేశారు. గతేడాది ఇది 2,31,000 మెట్రిక్ టన్నులుగానే ఉంది. ఒక్క ఆగస్టు నెలలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, అప్పారావుపేట, సిద్ధిపేట జిల్లాలోని నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీల్లో అత్యధికంగా 73,700 మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేశారు. ప్రాసెసింగ్ సమయంలో వచ్చే వ్యర్థాలను వేరు చేయగా లభించిన ‘ఎంఈఈ పౌడర్’ టన్నుకు గరిష్ఠంగా రూ.15,800 ధర పలకడం గమనార్హం.
ప్రభుత్వ ప్రోత్సాహం.. అధునాతన సాంకేతికత
తోటల నిర్వహణలో నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటించడం, ఫ్యాక్టరీలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతరం సమీక్షిస్తూ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ.. మద్దతు ధర నిర్ణయించడంలో, ప్రోత్సాహకాలు అందించడంలో చొరవ చూపారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ ధర పెరుగుదల మరింత ఊతాన్ని ఇస్తోందని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రెక్కలు ముక్కలు చేసి ఆస్తులు పంచితే.. రోడ్డుపై పడేశారు!