రెక్కలు ముక్కలు చేసి ఆస్తులు పంచితే.. రోడ్డుపై పడేశారు!
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:28 AM
జీవన భాగస్వామిని కోల్పోయి వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటున్న ఆ తండ్రిని.. భారంగా భావించి బయటకు తరిమేశారు కుమారులు. తనకోసం ఉంచుకున్న కొద్దిభూమిలో సాగుచేసుకుని జీవనం సాగిద్దామన్నా అడ్డుపడి కర్కశత్వాన్ని చూపుతున్నారు.
కొడుకులు ఇంటినుంచి తరిమేయడంతో దిక్కుతోచని స్థితిలో వృద్ధుడు
న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి
వికారాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జీవన భాగస్వామిని కోల్పోయి వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటున్న ఆ తండ్రిని.. భారంగా భావించి బయటకు తరిమేశారు కుమారులు. తనకోసం ఉంచుకున్న కొద్దిభూమిలో సాగుచేసుకుని జీవనం సాగిద్దామన్నా అడ్డుపడి కర్కశత్వాన్ని చూపుతున్నారు. దీంతో తనను ఆదుకోండి సారూ.. అంటూ ఆ వృద్ధుడు మంగళవారం వికారాబాద్ ఆర్డీవో కార్యాలయాన్ని ఆశ్రయించాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నాపూర్‌కు చెందిన హన్మంత్‌రెడ్డికి ఇద్దరు కుమారులు. కష్టపడి సంపాదించిన భూమిలో ఇద్దరు కొడుకులకు చెరో ఏడెకరాల చొప్పున రాసిచ్చాడు. తన జీవనోపాధి కోసం నాలుగు ఎకరాలు అట్టిపెట్టుకున్నాడు. నాలుగు ప్లాట్లు (ఇళ్లస్థలాలు) ఉంటే.. ఇద్దరు కుమారులు విక్రయించి, ఇళ్లు కట్టుకున్నారు. తొమ్మిదేళ్ల క్రితం భార్య మరణించడంతో.. హన్మంత్‌రెడ్డి కుమారుల వద్దే ఉంటున్నాడు. అయితే, వారు తల్లి చనిపోయిన తర్వాత.. తండ్రికి సరిగ్గా తిండిపెట్టడం మానేశారు. అదేమని ప్రశ్నించగా, ఇంటి నుంచి బయటకు గెంటేశారు. చిన్న కొడుకు తండ్రి తలపై కొట్టడంతో.. గాయాలయ్యాయి. దీంతో ఆ వృద్ధుడు అంగన్వాడీ భవనం ఆవరణలో తలదాచుకుంటున్నాడు. ‘‘నా భూమిని నాకు అప్పగిస్తే.. దాన్ని కౌలుకు ఇచ్చుకుని, వచ్చే ఆదాయంతో జీవితాన్ని వెళ్లదీస్తా’’ అంటూ ఆర్డీవో కార్యాలయం అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి