ఆ చోరీ ఇంటిదొంగల పనే?
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:48 AM
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఆయుధాగారంలో జరిగిన భారీ చోరీ ఇంటిదొంగల పనే అని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
కంటోన్మెంట్ ఆయుధాగారంలో చోరీ వెనుక సిబ్బంది హస్తం..
ప్రాథమికంగా నిర్ధారణ
15 మందిని విచారించి ఒకరిని
అదుపులోకి తీసుకున్న అధికారులు
సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న వైనం
బయట విక్రయించేందుకే ఆయుధాల చోరీ?
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, తిరుమలగిరి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఆయుధాగారంలో జరిగిన భారీ చోరీ ఇంటిదొంగల పనే అని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. సదరు వ్యక్తి సైన్యానికి చెందిన వ్యక్తేనని, అతడి నుంచి కీలక ఆధారాలు లభ్యమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై పోలీసులు అధికారికంగా ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారంలో జరిగిన భారీ చోరీపై కేంద్రస్థాయిలో నిఘావర్గాలు దృష్టి పెట్టాయి. సైనిక విభాగాలకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులతోపాటు ఎన్‌ఐఏ, కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, రాష్ట్ర పోలీసు, నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి. కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను దర్యాప్తు అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ దొంగతనం ఘటన ఒక్కరు చేసింది కాదని, పలువురు కలిసి ఈ పనికి పాల్పడ్డారని.. అది కూడా లోనివ్యక్తుల పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. సైనిక అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మాయమైన వాటిలో నాలుగు ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, ఆరు 9 ఎంఎం 1ఏ పిస్టల్స్, ఒక 6.35 బోర్ పిస్టల్ ఉన్నాయి. వీటితోపాటు ఆయా ఆయుధాల మ్యాగజైన్లు, పాసివ్ నైట్ విజన్ బైనాక్యులర్ కూడా ఉన్నాయి. మందుగుండు సామాగ్రిలో ఏకే 203కి చెందిన 720 రౌండ్లు, 9 ఎంఎం పిస్టల్స్‌కు చెందిన 1120 రౌండ్లు, ఇన్సా్‌సకు చెందిన బాల్, ట్రేసర్, బ్లాంక్ రౌండ్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే సుమారు 55 నుంచి 65 కిలోల వరకు బరువు ఉండవచ్చని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.
వాహనంలో తీసుకెళ్లారా?
ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎప్పటిలాగే ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని లెక్కించి ఆయుధాగారాన్ని మూసివేశారు. మరుసటి రోజు సోమవారం ఉదయం 7.50 గంటలకు తెరిచే సమయంలో తాళాలు, తలుపు పగిలి ఉండటం, ఆయుధాలు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది. అంటే, మధ్యలో ఉన్న 13 గంటల 50 నిమిషాల వ్యవధిలో చోరీ జరిగింది. అత్యంత భద్రత ఉండే సైనిక ప్రాంగణంలోకి వచ్చి, ఆయుధాగారం ఎక్కడుందో గుర్తించి, తాళాలు పగులగొట్టి, ఏ ఆయుధాలు ఎక్కడున్నాయో తెలుసుకుని, దాదాపు అర క్వింటాల్‌కు పైగా బరువున్న సొత్తును బయటకు తరలించడం సాధారణ చోరీలా కనిపించడం లేదని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. చోరీ చేసిన వాళ్లు వాహనం ఉపయోగించారా? వారికి సహకారం అందించింది ఎవరు? అన్న కోణాలు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఆయుధాగారం, మందుగుండు సామాగ్రి నిల్వ ఉన్న ప్రాంతంలోకి అధికారికంగా ప్రవేశించే అవకాశం ఉన్న సిబ్బందిని గుర్తించి ఇప్పటికే ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయుధాల జారీ, స్వీకరణ రిజిస్టర్లు, ఇతర రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. ఆయుధాగారం పక్కనే వాచ్‌టవర్ ఉంది. దాని మీద విధుల్లో ఉన్న గార్డు దొంగతనాన్ని ఎందుకు పసిగట్టలేకపోయాడు? అన్న కోణంలో విచారిస్తున్నారు. ఆయుధాలను అక్రమంగా విక్రయించేందుకు దొంగిలించారా? ఏదైనా వ్యవస్థీకృత నేర ముఠాకు అందించేందుకా? ఎవరి ఆదేశాలతోనైనా ఆయుధాలను బయటకు తరలించారా? లేక వాటిని ఏదైనా తీవ్రమైన నేరానికి ఉపయోగించాలన్న ఉద్దేశం ఉందా? వంటి పలు కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద సంబంధాలపైనా అనుమానాలను తోసిపుచ్చలేమని పేర్కొంటున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు సహకరిస్తున్న పలువుర్ని అరెస్టు చేసిన క్రమంలో.. కొందరికి విధ్వంసం సృష్టించే బాధ్యతలను, మరికొందరి నుంచి సైనిక స్థావరాలు, కోర్టు మార్షల్ ఎదుర్కొంటున్న సైనిక సిబ్బంది సమాచారం, ఫోటోలను ఉగ్రవాదులు తెప్పించుకున్న విషయాలు బయటపడ్డాయి. అయితే, ఇది సైన్యంలో పని చేస్తున్న వారి పనే అయి ఉంటుందని, బయటి నుంచి వచ్చినవారు చోరీకి పాల్పడే అవకాశాలు తక్కువని అంచనాకు వచ్చారు. ఈ మేరకు సైనిక సిబ్బందిలోని 15 మంది అనుమానితులను విచారించినట్లు తెలిసింది. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారని, అతడి నుంచి కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం.
కంటోన్మెంట్‌లో హై అలర్ట్
ఆయుధాల చోరీ గురించి తెలిసి అక్కడికి మల్కాజిగిరి డీసీపీ సహా పలువురు పోలీసు అధికారులు వెళ్లేసరికి క్రైమ్ సీన్ అంతా తారుమారై ఉన్నట్లు తెలిసింది. మరోవైపు, కంటోన్మెంట్ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. బొల్లారంలోని ఆర్మీ కార్యాలయాలు, స్థావరాల్లో నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. ఆర్మీ స్కూళ్లకు 3 రోజులపాటు సెలవులు ప్రకటించారు. పలు రోడ్లను కూడా మూసివేయటంతో ఆ రహదారులు గుండా వెళ్లాల్సిన పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కొండా సురేఖ అంశంపై ఎటువంటి ఆదేశాలు లేవు
హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు పీపీపీఏసీ ఆమోదం