జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:48 AM
జనగణనలో ఓబీసీల వివరాలు నమోదు చేసేందుకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలి
సీఎం రేవంత్‌కు బీసీలపై చిత్తశుద్ధి లేదు
ఓబీసీ డిక్లరేషన్ సభలో కల్వకుంట్ల కవిత
రాంనగర్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జనగణనలో ఓబీసీల వివరాలు నమోదు చేసేందుకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇందుకోసం తమిళ నాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్నారు. కేంద్రం స్పందించకపోతే రాష్ట్రంలో జనగణన ప్రక్రియను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం, హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన ఓబీసీ డిక్లరేషన్ సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్ర చేస్త్తోందని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఏకమై పోరాడితేనే హక్కులు కాపాడుకోగలమని అన్నారు. జనగణనలో ఓబీసీల వివరాలు నమోదుకు ప్రత్యేక కాలమ్‌తో పాటు డ్రాప్ డౌన్ బాక్స్ ఏర్పాటు చేయాలని కవిత కోరారు.
రాబోయే తరాలకు మనం ఇచ్చే ఆస్తి రిజర్వేషన్లు సాధించి పెట్టడమేనని వ్యాఖ్యానించారు. బీసీ కులాలకు సంబంధించి ఒక్క రాష్ట్రంలో ఒక్కో పేరు ఉండటంతో, అందరినీ వేర్వేరుగా లెక్కిస్తే జనాభా తక్కువగా కనిపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి కేటాయింపులు తగిన స్థాయిలో దక్కవని చెప్పారు. రూ. 50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో బీసీల కోసం యేటా రూ. 2 వేల కోట్లు కూడా ఖర్చు చేయడం లేదని మండిపడ్డారు. కేంద్రం రూ. 12 వేల కోట్లు ఖర్చు చేసి చేపడుతున్న లెక్కల్లో.. బీసీల సంఖ్య ఎంత ఉందో తేల్చలేకపోతే ఆ ఖర్చు దండగేనని విమర్శించారు. బీసీల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని కవిత ఆరోపించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పిన సీఎం, ప్రధాని మోదీని 30 సార్లు కలిసినా ఈ బిల్లు గురించి మాట్లాడలేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ఓబీసీ, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News