అండాల సేకరణ వెనుక భారీ నెట్వర్క్.. సీపీ సుమతి ఏమన్నారంటే
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:56 PM
ఓయాసిస్ ఫెర్టిలిటీ కేసుకు సంబంధించిన వివరాలను మల్కాజ్గిరి సీపీ సుమతి మీడియాకు తెలియజేశారు. ఈ కేసులో సద్గురు హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను అరెస్ట్ చేశామన్నారు.
హైదరాబాద్, నవంబర్ 28: ఓయాసిస్ ఫెర్టిలిటీ కేసుకు సంబంధించిన వివరాలను మల్కాజ్గిరి సీపీ సుమతి మీడియాకు తెలియజేశారు. ఈ కేసులో సద్గురు హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను అరెస్ట్ చేశామన్నారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 1145/2026 కేసులో A8, A9 నిందితులుగా గుర్తించామని తెలిపారు. ఏసీపీ ప్రవీణ్ రెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఏ8గా సద్గురు హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రతీక్ అనిల్ గగ్లానీ (44) , ఏ9గా ఓయాసిస్ ఫెర్టిలిటీ కార్పొరేట్ ఆఫీస్ మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజర్షి దేవ్ ఉన్నారన్నారు.
ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులుగా ఉన్నట్లు సుమతి తెలిపారు. అనుమతులు లేకుండా అండాల సేకరణ, ఆర్టీఏ కార్యకలాపాలు, మహిళల అక్రమ రవాణా కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ వ్యవహారానికి సంబంధించి కేసులు నమోదయ్యాయన్నారు. సరూర్‌నగర్‌లో రెండు, బేగంపేటలో ఒకటి, DM&HO ఫిర్యాదులతో మరో ఐదు కేసులు నమోదైనట్లు తెలిపారు. మలక్‌పేట్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, మాంకాళి, మియాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయన్నారు. సద్గురు హెల్త్ కేర్ నిర్వహిస్తున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రాల్లో అండాల అక్రమ సేకరణ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించామని తెలిపారు. బంజారాహిల్స్, మియాపూర్, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్ కేంద్రాల్లోనూ ఈ కార్యకలాపాలు జరిగినట్లు గుర్తించామన్నారు. ఫౌండర్ గీదెల కిరణ్, కో-ఫౌండర్ డాక్టర్ గీదెల దుర్గారావు ఆదేశాల మేరకు ఏజెంట్ల ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను సమీకరించినట్లు వెల్లడైందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి వారి నుంచి అండాలను సేకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని చెప్పారు.
అండాల ఉత్పత్తి కోసం మహిళలకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చినట్లు ఆధారాలు లభించాయని సుమతి వెల్లడించారు. అండాల సేకరణకు సంబంధించి మహిళలను లెవల్-2 ఫెర్టిలిటీ కేంద్రాలకు పంపించినట్లు వెల్లడైందన్నారు. A8 ప్రతీక్ అనిల్ గగ్లానీ 2025 నుంచి COOగా పనిచేస్తూ కేంద్రాల నిర్వహణ, వైద్య పరికరాల కొనుగోలు, ఇతర కార్యకలాపాలను పర్యవేక్షించినట్లు గుర్తించినట్లు చెప్పారు. దాతల ప్యాకేజీల వివరాలను రోగులకు వివరించడంతో పాటు ART బ్యాంక్ ఇన్ఛార్జ్ సునీల్ రాయ్‌తో తరచూ సంప్రదింపులు జరిపినట్లు వెల్లడైందన్నారు. దేశవ్యాప్తంగా సద్గురు హెల్త్ కేర్‌కు సంబంధించి 43 క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు నిందితుల వాంగ్మూలంలో తేలిందన్నారు. ప్రతి నెలా దాదాపు 600 సెల్ఫ్ సైకిల్స్, 100 అండాల దాత సైకిల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంస్థకు నెలకు సుమారు రూ.28 కోట్ల వైట్‌మనీ ఆదాయం వస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ HDFC బ్యాంకు ఖాతాలో రూ.487 కోట్ల డెబిట్, క్రెడిట్ లావాదేవీలను గుర్తించామని.. అండాల దానం పేరుతో మహిళలను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించామన్నారు. మహిళలకు చెల్లిస్తున్న మొత్తం చాలా తక్కువగా ఉండగా, కన్సీవ్డ్ కపుల్స్ నుంచి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు బ్యాంకు లావాదేవీల ద్వారా గుర్తించామన్నారు.
మహిళల దోపిడీకి సంబంధించిన ఆధారాలను ఇప్పటికే కోర్టుకు సమర్పించామని మల్కాజ్గిరి సీపీ తెలిపారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించామని.. ఏజెంట్లు, బాధిత మహిళలు, ఫెర్టిలిటీ కేంద్రాల మధ్య సంబంధాలు విచారణలో వెలుగులోకి వచ్చాయన్నారు. మహిళల రిక్రూట్మెంట్ నుంచి అండాల సేకరణ, చివరకు ఆర్థిక లావాదేవీల వరకు మొత్తం నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు. సద్గురు హెల్త్ కేర్ కింద ఓయాసిస్ ఫెర్టిలిటీ, సద్గురు ART బ్యాంకులు పనిచేస్తున్నట్లు గుర్తించామని.. డాక్టర్ పద్మజ ఫెర్టిలిటీ సెంటర్, నర్మద ఫెర్టిలిటీ సెంటర్ల కార్యకలాపాలపైనా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. సద్గురు హెల్త్ కేర్‌కు చెందిన 11 మంది డైరెక్టర్ల బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నామన్నారు. డిజిటల్ ఆధారాలు, CDR డేటా, బ్యాంకు లావాదేవీలను అనుసంధానం చేసి విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. గతంలో అరెస్టయిన దుర్గాప్రసాద్‌కు సద్గురు హెల్త్ కేర్‌తో ఉన్న సంబంధాలు, మధ్యవర్తులకు అందిన కమీషన్లపై విచారణ కొనసాగుతోందన్నారు.
కన్సీవ్డ్ కపుల్స్ నుంచి వచ్చిన డబ్బు సంస్థలకు నగదు రూపంలో చేరిందా? ఆన్లైన్ ద్వారా చేరిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సుమతి తెలిపారు. ఇప్పటివరకు 8 ల్యాప్‌టాప్‌లు, వివిధ మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, భౌతిక రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్పొరేట్ సంస్థల ముసుగులో షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారా? బహుళ కేంద్రాలతో అక్రమ నెట్వర్క్ నడుస్తోందా? అనే కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు. సంస్థల కార్పొరేట్ ప్రొఫైల్స్, డైరెక్టర్లు, నామినీలు, మేనేజీరియల్ సిబ్బంది పాత్రను పరిశీలిస్తున్నామని అన్నారు. వెంకట సూర్య కిరణ్ గీదెల, డాక్టర్ గీదెల దుర్గారావు, ఇతర కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. A9 డాక్టర్ రాజర్షి దేవ్ 2026 ఏప్రిల్ నుంచి మెడికల్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నారని.. క్లినికల్ క్వాలిటీ, ఆపరేషన్ థియేటర్ల సిద్ధత, వైద్యుల నియామకం వంటి బాధ్యతలను A9 పర్యవేక్షించినట్లు గుర్తించామన్నారు. అనుమతి లేని విధానాలకు సహకరించే వైద్యులను నియమించి కార్యకలాపాలను పర్యవేక్షించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఇద్దరు నిందితులు నెలకు రూ.3.5 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు వేతనాలు పొందుతున్నట్లు వెల్లడించారు. A8 వద్ద రెండు మొబైల్ ఫోన్లు, A9 వద్ద ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆర్థిక లావాదేవీలు, వైద్యుల నియామకాలు, పరికరాల కొనుగోళ్లు, దేశవ్యాప్తంగా ఉన్న 43 క్లినిక్‌ల నిర్వహణలో నిందితుల పాత్రపై మరింత విచారణ చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు 600 మంది డోనర్లను గుర్తించామని మల్కాజిగిరి సీపీ సుమతి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ హల్చల్
పూలే దంపతుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
Read Latest Telangana News And Telugu News