ఎన్టీఆర్‌కు ప్రముఖుల నివాళి
ABN , Publish Date - May 28 , 2026 | 09:37 AM
టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు.
హైదరాబాద్, మే 28: టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద దగ్గుబాటి దంపతులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, వైసీపీ నేత లక్ష్మీపార్వతి, తదితరులు ఎన్టీఆర్ సమాధి వద్ద పుప్పగుచ్చాలు సమర్పించి అంజలి ఘటించారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, సినీ ప్రముఖులు.. ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు.
ఎన్టీఆర్‌ది మరణం లేని జననం: పురందేశ్వరి
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహాలు స్థాపించడం పరిపాటన్నారు. తెలుగువారు ఎక్కడున్నా.. అందరిపై ఎన్టీఆర్ ఆశీర్వాదం ఉంటుందన్నారు. ప్రజా నాయకుడిగా.. రాజకీయాలంటే ప్రజా సేవ అని ఎన్టీఆర్ రుజువు చేశారని తెలిపారు. ఎన్టీఆర్ ది మరణం లేని జననమని.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడారు. ‘మా కుటుంబం మీద మాత్రమే కాదు.. అందరిపై నాన్న ఆశీర్వాదం ఉండాలి’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.
మోత్కుపల్లి భావోద్వేగం...
ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుని మోత్కుపల్లి నర్సింహులు భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ లాంటి మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేమన్నారు. ఎన్టీఆర్ మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నానని.. బోగాల కోసం, డబ్బు కోసం ఎగబడేవాడు నాయకుడు కాదన్నారు. అర్ధ రూపాయి లేకున్నా.. ఎన్టీఆర్ వలనే నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకొచ్చారు. ‘మాదిగ బిడ్డనైన నాకు.. తండ్రి మాదిరి దగ్గరుండి నా పెళ్లి చేశారు’ అని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడున్న నాయకులు దోపిడీతో కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. మాదిగలను పైకి తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. 70లక్షల మంది ఉన్న మాదిగలకు మాదిగ మహాశక్తి జెండా తోడుంటుందని తెలిపారు. మాదిగ మహాశక్తితో మాదిగలను ఏకం చేస్తామన్నారు. ఎన్టీఆర్ ఆశీర్వాదంతో మాదిగలు, పేదలను ఏకం చేస్తామని తెలిపారు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు ఉంటుందని మోత్కుపల్లి నరసింహులు వెల్లడించారు.
ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నారు: లక్ష్మీపార్వతి
ఎన్టీఆర్ చనిపోయినా ప్రజల గుండెల్లో ఇప్పటికీ నిలిచే ఉన్నారని లక్ష్మీపార్వతి అన్నారు. అలాంటి మహానుభావుడికి ఇల్లాలిగా ఉండటం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. ఆయన ఆశయాల సాధన కోసం పనిచేస్తానని తెలిపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు వారంతా ఆయన్ని స్మరించుకుంటున్నారన్నారు. ఆయన పేరు చెప్పుకుంటూ.. ప్రజలకు నరకం చూపిస్తోన్న వారి గురించి మాట్లాడటం టైం వేస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. కొందరు ఆయన పార్టీని ఆయన పేరును వాడుకుంటున్నా.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇలాంటి వారు బ్రతికున్నా చనిపోయినట్లే అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమీర్‌పేట్ మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి.. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం పనిచేయాలని కోరుతున్నట్లు లక్ష్మీపార్వతి తెలిపారు.
ఎన్టీఆర్‌కు నాగం జనార్దన్ నివాళులు
ఎన్టీఆర్‌కు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాయర్లు, డాక్టర్లు, మేధావులకు టికెట్ ఇచ్చి గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ అని అన్నారు. అవినీతి లేని పాలన.. పేదల సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వం ఎన్టీఆర్ ది అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో, దేశంలో నేడు అవినీతి పెరుగుతోందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో అవినీతిపైన పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు నాగం జనార్దన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్ 103వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ 103వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And Telugu News