Share News

రోడ్డు ప్రమాదాలను చూస్తే కన్నీళ్లొస్తున్నాయి

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:02 AM

దేశంలో ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దాదాపు 1.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు.

రోడ్డు ప్రమాదాలను చూస్తే కన్నీళ్లొస్తున్నాయి
Nitin Gadkari

  • దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు

  • 1.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు

  • రోడ్ల నిర్మాణంలో నాణ్యత తగ్గితే కఠిన చర్యలు

  • మౌలిక సదుపాయాలే ఆర్థికాభివృద్ధికి వెన్నెముక

  • పీపీపీ విధానాన్ని మరింతగా ప్రోత్సహించాలి

  • ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెంచాలి

  • ఐఆర్‌సీ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దాదాపు 1.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో దాదాపు 66 శాతం మంది 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులేనని తెలిపారు. ఇది తనకెంతో బాధ కలిగిస్తోందని, కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్లను గుర్తించి తక్షణమే సరిచేయాలని ఆదేశించారు. డీపీఆర్‌లను అర్హత కలిగిన నిపుణులతోనే రూపొందించాలని, తక్కువ ధరకు కోట్‌ చేసిన వారికే పనులు అప్పగించే విధానానికి స్వస్తి పలకాలని సూచించారు.


గురువారం హైదరాబాద్‌లో జరిగిన 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) వార్షిక సమావేశానికి గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రోడ్ల నిర్మాణానికి ముందు, తర్వాత భద్రతా ఆడిట్లు నిర్వహించాలని, అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్‌పా్‌సలు, సురక్షితమైన జంక్షన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి ఇంజనీర్‌ రోడ్డు భద్రతను వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని, ప్రమాద మరణాలు సున్నాకు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో తాను కూడా రోడ్డు ప్రమాదంలో నాలుగు చోట్ల ఎముకలు విరిగి రెండేళ్లపాటు ఇంటికే పరిమితమయ్యానని తెలిపారు. రహదారులు, వంతెనలు, సొరంగ మార్గాల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడితే సహించేది లేదని, బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


రహదారుల నెట్‌వర్క్‌ విస్తరణలో వారి పాత్ర కీలకం..

దేశంలో జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ విస్తరణలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి గడ్కరీ అభినందించారు. మౌలిక సదుపాయాలే ఆర్థికాభివృద్ధికి వెన్నెముక అని, మౌలిక రంగంలో పెట్టే ప్రతి రూ.100 పెట్టుబడికి సుమారు రూ.325 మేర ఆర్థిక ప్రయోజనం లభిస్తుందని తెలిపారు. దేశంలో లాజిస్టిక్స్‌ వ్యయం గతంలో జీడీపీలో 16 శాతం ఉండగా, ప్రస్తుతం సుమారు 9 శాతానికి తగ్గిందన్నారు. మౌలిక రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని మరింత ప్రోత్సహించాలని సూచించారు. భారత్‌ ఏటా సుమారు రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని గడ్కరీ తెలిపారు.


ఈ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచాలని, ఇథనాల్‌, మిథనాల్‌, బయోడీజిల్‌, ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, హైడ్రోజన్‌, విద్యుత్‌ ఆధారిత ఇంధనాలను ప్రోత్సహించాలని సూచించారు. విరిగిన బియ్యం, మొక్కజొన్న, చెరుకు రసం నుంచి ఇథనాల్‌ను తయారు చేస్తున్నామని, రైతులు ఇంధన ఉత్పత్తిదారులుగా కూడా ఎదగాలని ఆకాంక్షించారు. రోడ్ల నిర్మాణ యంత్రాల్లోనూ ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలన్నారు. నాగ్‌పూర్‌ జబల్‌పూర్‌ జాతీయ రహదారిపై వరిగడ్డితో తయారుచేసిన బయో బిటుమెన్‌ను ఉపయోగించి కిలోమీటరు మేర రోడ్డు నిర్మించినట్లు వెల్లడించారు.


ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఆమోదం తెలపండి..

తెలంగాణ రవాణా రంగానికి కీలకమైన 3 ప్రధాన రోడ్డు ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులు ప్రారంభించేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం త్వరగా లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-65)ని ఆరు లేన్లుగా విస్తరించడం, హైదరాబాద్‌ - శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలని కోరారు. కాగా, హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి మరిన్ని ఫ్లైఓవర్లు మంజూరు చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ కోరారు.


అట్టహాసంగా ఐఆర్‌సీ సదస్సు..

ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) 85వ వార్షిక సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఎంపీలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జ్యోతి ప్రజ్వలన చేశారు. సదస్సుకు వచ్చిన అతిథులకు కొమ్ము నృత్యంతో స్వాగతం పలికారు. టెక్నికల్‌ ఎక్స్‌పోలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవంపై ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. నూతన హైకోర్టు డిజైన్‌, హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటుచేసే సదుపాయాల విషయాలను తెలుపుతూ ప్రత్యేకంగా నమూనాను ఏర్పాటుచేశారు.


ఈ కార్యక్రమంలో రహదారి మౌలిక సదుపాయాల రంగ నిపుణులు, ఇంజినీర్లు, పరిశోధకులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, సదస్సుకు వచ్చిన పలువురు ఎంపీలకు చేదు అనుభవం ఎదురైంది. అధికారులు ప్రొటోకాల్‌ పాటించలేదని, కూర్చునేందుకు కుర్చీలను ఏర్పాటు చేయలేదంటూ బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తరువాత అందరికీ కుర్చీలు ఏర్పాటు చేయడంతో శాంతించారు. సదస్సు సందర్భంగా ఎంపీలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కొద్దిసేపు ముచ్చటించారు.


ఇవి కూడా చదవండి...

‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్

నాపై ఆరోపణలు చేసేవారు చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే: వీసీ సజ్జనార్

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 20 , 2026 | 04:11 AM