Share News

యాత్రల్లో జాగ్రత్త!

ABN , Publish Date - Aug 28 , 2026 | 09:13 AM

‘విహార యాత్రలు, ఆధ్యాత్మిక పర్యటనలు సమయానుకూలంగా ఉండాలి.. వెళ్తున్న ప్రదేశాల్లోని వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలి.

యాత్రల్లో జాగ్రత్త!
Nepal floods

  • ఏ సమయంలో వెళ్లాలో సరిచూసుకోవాలి

  • లేదంటే ఊహించని ప్రమాదాలు తలెత్తే అవకాశం

  • యాత్రికులను హెచ్చరిస్తున్న నేపాల్‌ ఘటన

హైదరాబాద్‌ సిటీ: ‘విహార యాత్రలు, ఆధ్యాత్మిక పర్యటనలు సమయానుకూలంగా ఉండాలి.. వెళ్తున్న ప్రదేశాల్లోని వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలి.. ఆయా ప్రాంతాల్లో సీజన్‌ దాటిన తర్వాత వెళ్లినప్పుడు గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా.. లేదా అనే వాటిని తప్పనిసరిగా సరిచూసుకోవాలి.. లేకుంటే ఊహించని ప్రమాదాల బారిన పడాల్సి వస్తోంది’ అని పర్యాటక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. యాత్రలు సాఫీగా జరగాలంటే ముందస్తు ప్రణాళికలు అవసరమని సూచిస్తున్నారు. నేపాల్‌, టిబెట్‌ సరిహద్దులోని భోటే కోషి నది నుంచి బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఆకస్మికంగా పోటెత్తిన వరదతో 750 మందికి పైగా గల్లంతుకాగా.. 160 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్‌ నుంచి వెళ్లిన 31 మంది యాత్రికుల్లో అందరూ క్షేమంగా ఉన్నారు.


జూలై, ఆగస్టు యాత్రల్లో ప్రమాదం

రాష్ట్రంలోని పర్యాటక స్థలాలు, ప్రముఖ ఆలయాల సందర్శనతోపాటు దేశ, విదేశాల్లో పేరొందిన ప్రాంతాలకు నగరవాసులు తరలివెళ్తుంటారు. ప్రధానంగా చార్‌ధామ్‌ యాత్ర, కైలాష్‌ మానస సరోవర్‌ లాంటి చోట్లకు వెళ్తుంటారు. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్ర ప్రతిఏటా ఏప్రిల్‌ చివర లేదా మే ప్రారంభంలో ప్రారంభవుతుంది. రద్దీ మే నుంచి జూన్‌ వరకు ఉంటుంది. జూలై నుంచి ఆగస్టు వరకు భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో తరచుగా కొండ చరియలు విగిరిపడుతుంటాయి. కాగా, చైనా/టిబెట్‌ మధ్యలో ఉన్న కైలాష్‌ మానస సరోవర్‌ యాత్ర కూడా మే నుంచి జూన్‌ వరకు ఉంటుంది.


city4.jpgఇక జూలై నుంచి ఆగస్టు వరకు నేపాల్‌ గుండా వెళ్లే రవాణా మార్గాల్లో భారీ వర్షాలు కురుస్తుంటాయి. జూలై, ఆగస్టులో యాత్రలకు వెళ్లొద్దని హెచ్చరికలు ఉన్నప్పటికీ.. కొందరు వాటిని పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కైలాష్‌ మానస సరోవర్‌ యాత్ర కఠినంగా ఉంటుంది. అక్కడ ఆక్సిజన్‌ సగానికి తగ్గిపోవడం వల్ల ప్రతి ఏటా 20-30 మంది వృద్ధులు ఊపిరితిత్తుల వాపు, గుండెపోటుతో మరణిస్తుంటారు. 2013లో ఉత్తరాఖండ్‌లో తలెత్తిన వరదలతో హైదరాబాద్‌ నుంచి చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన దాదాపు 300 మంది ఇబ్బంది పడ్డారు. ఇందులో కొందరు గల్లంతుకాగా.. సుమారు 30 మంది వరకు చనిపోయినట్లు తెలిసింది.


మానస సరోవర్‌ యాత్ర క్లిష్టమైంది

కష్టమైన మానస సరోవర్‌ యాత్రను నేను 11 సార్ల్లు పూర్తి చేశాను. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి నేపాల్‌లోని ఖాట్మండు, టిబెట్‌కు ప్రయాణం చేశాను. పర్వత ప్రాంతం, మంచుకొండలు, సముద్ర మట్టానికి 18,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. దాదాపు 54 కిలోమీటర్ల నడకలో ఊపిరి కష్టంగా అందుతుంది. అయితే నేపాల్‌లో మాదిరిగా ఘోర విపత్తు ఎప్పుడూ సంభవించలేదు.

  • పేరి ఉదయ్‌శంకర్‌, రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగి, బౌద్ధనగర్‌


ఈ వార్తలు కూడా చదవండి:

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

అర్థం చేసుకునేవాళ్లు దొరికితేనే రెండో పెళ్లి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 09:24 AM