Share News

‘తోక’ను తెంచలేక..

ABN , Publish Date - Aug 28 , 2026 | 08:22 AM

తొలి రెండు రోజులు భారత బ్యాటర్లదే హవా.. ఆ తర్వాత బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. ఫలితంగా 213 పరుగుల భారీ ఆధిక్యం.. అటు ఆతిథ్య శ్రీలంకకు ఫాలోఆన్‌ ఆడాల్సిన పరిస్థితి.

‘తోక’ను తెంచలేక..
India vs Sri Lanka 2nd Test

  • సోనాల్‌ వీరోచిత శతకం

  • శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ 429/9 డిక్లేర్‌

  • రెండో టెస్టు డ్రా

  • 1-0తో టీమిండియాదే సిరీస్‌


కొలంబో: తొలి రెండు రోజులు భారత బ్యాటర్లదే హవా.. ఆ తర్వాత బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. ఫలితంగా 213 పరుగుల భారీ ఆధిక్యం.. అటు ఆతిథ్య శ్రీలంకకు ఫాలోఆన్‌ ఆడాల్సిన పరిస్థితి. ఈసారీ బౌలర్లు ప్రభావం చూపడంతో లంక 229/6తో చివరి రోజును ఆరంభించింది. ఇంకేముంది.. టెయిలెండర్లను చుట్టేయడం.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తూ, రెండో టెస్టు విజయంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేద్దామనుకున్న భారత్‌ ఆశలపై సోనాల్‌ దినుష (133 నాటౌట్‌) సంచలన ఆటతో నీళ్లు జల్లాడు. అతడికి చివరి వరుస బ్యాటర్ల నుంచి అనూహ్య రీతిలో సహకారం అందింది.


దీంతో సెషన్లు గడిచినా భారత బౌలర్లకు అలసట మిగిలిందే తప్ప ఆ నాలుగు వికె ట్లు తీయలేకపోయారు. చివరికి లంక తమ ఫాలోఆన్‌లో 429/9 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్‌ చేయగా, 216 పరుగుల ఆధిక్యం దక్కింది. అప్పటికి చివరి సెషన్‌లో మరో 18 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. అయితే తొలి టెస్టును గెలిచిన భారత్‌ 1-0తో సిరీస్‌ అందుకుంది. కేశర (150 బంతుల్లో 4 ఫోర్లతో 46), లాహిరు కుమార (90 బంతుల్లో 1 ఫోర్‌తో 12) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. జడేజా, మానవ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సోనాల్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా దేవ్‌దత్‌ నిలిచారు.


విసిగించారు..:

గురువారం ఐదో రోజు 229/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో లంక తమ ఫాలోఆన్‌ను ఆరంభించింది. అప్పటికి లంక 16 పరుగుల ఆధిక్యంతోనే ఉంది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన సోనాల్‌ దినుష మిన హా మిగతా బ్యాటర్లు టెయిలెండర్లే కావడంతో భారత్‌ విజ యం ఖాయమే అనిపించింది. కానీ చివరి వరుస బ్యాటర్లను అవుట్‌ చేయడంలో భారత బౌలర్లు మరోసారి తేలిపోయారు. సోనాల్‌, కేశర ఎలాంటి తడబాటు లేకుండా సెషన్‌ ఆద్యంతం పాతుకుపోయారు. దినుష హాఫ్‌సెంచరీతో తొలి సెషన్‌లో వికెట్‌ కోల్పోకుండా లంక ఏకంగా 100 పరుగులు జత చేయగలిగింది.


సోనాల్‌ అజేయ సెంచరీ:

రెండో సెషన్‌లో కూడా బౌలర్లు తీసింది రెండు వికెట్లే. ఏడో వికెట్‌కు 112 పరుగులు జత చేశాక కేశరను మానవ్‌ అవుట్‌ చేశాడు. అప్పటికే ఈ జోడీ 246 బంతులను ఎదుర్కోవడం విశేషం. ప్రభాత్‌ (2) త్వరగానే అవుటైనా.. ఈసారి సోనాల్‌కు లాహిరు కుమార నుంచి మద్దతు లభించింది. సోనాల్‌ చివరి సెషన్‌లో ఈ టెస్టులో వరుసగా రెండో సెంచరీని పూర్తి చేశాడు. లాహిరు వెనుదిరిగాక కూడా చివరి వికెట్‌పై లంక మరో పది ఓవర్లపాటు ఆడి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అయితే ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఆ వెంటనే మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.


రికార్డులు..

ఒకే టెస్టులో రెండు శతకాలు బాదిన మూడో బ్యాటర్‌గా సోనాల్‌. గతంలో విజయ్‌ హజారే (1948లో), ఆండీ ఫ్లవర్‌ (2001లో)ఉన్నారు. 2015 నుంచి శ్రీలంకలో భారత జట్టు వరుస టెస్టు విజయాల (6)కు బ్రేక్‌ పడింది. తొలి ఇన్నింగ్స్‌లో 500+ పరుగులు సాధించినా భారత్‌ టెస్టును గెలవకపోవడం 2017 తర్వాత ఇదే మొదటిసారి.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 503/9 డిక్లేర్‌

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: 290 ఆలౌట్‌

శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ (ఫాలోఆన్‌): ఉడార (సి) జైన్‌ (బి) సిరాజ్‌ 3, మిషార (ఎల్బీ) జడేజా 32, పసిందు (స్టంప్‌) పంత్‌ (బి) మానవ్‌ 92, మెండిస్‌ (సి) గిల్‌ (బి) ప్రసిద్ధ్‌ 55, ధనంజయ (సి) పడిక్కల్‌ (బి) మానవ్‌ 23, సోనాల్‌ (నాటౌట్‌) 133, డిక్‌వెల్లా (ఎల్బీ) జైన్‌ 6, కేశర (సి) జురెల్‌ (బి) మానవ్‌ 46, ప్రభాత్‌ (సి) జురెల్‌ (బి) జడేజా 2, లాహిరు కుమార (సి) జైస్వాల్‌ (బి) జడేజా 12, అసిత (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 25; మొత్తం: 154 ఓవర్లలో 429/9 డిక్లేర్‌; వికెట్ల పతనం: 1-5, 2-63, 3-178, 4-209, 5-212, 6-218, 7-330, 8-355, 9-402. బౌలింగ్‌: ప్రసిద్ధ్‌ కృష్ణ 18.3-3-57-1, సిరాజ్‌ 15-7-26-1, మానవ్‌ సుతార్‌ 41-7-121-3, సారాంశ్‌ 37-4-98-1, జడేజా 38.3-4-94-3, గిల్‌ 2-0-8-0, జైస్వాల్‌ 1-0-9-0, జురెల్‌ 1-0-1-0.


ఇవి కూడా చదవండి:

భారత్‌కు ఎదురుందా?

సచిన్ రికార్డును నా కొడుకు అందుకోలేడు: జో రూట్ తండ్రి మాట్

Updated Date - Aug 28 , 2026 | 08:27 AM