లైంగికదాడి యత్నం.. బాధితురాలు ఆత్మహత్య..
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:50 AM
లైంగికదాడికి యత్నించడంతోపాటు, బాధితురాలు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన నేరస్థుడికి నల్లగొండ రెండో అదనపు జిల్లా కోర్టు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక ప్రత్యేక న్యాయస్థానం నాలుగు జైలు శిక్షలను విధించింది.
నేరస్థుడికి 4 జైలు శిక్షలు
3 కేసుల్లో పదేళ్ల చొప్పున.. మరో కేసులో ఏడాది
ఏకకాలంలో అమలు.. ఫలితంగా పదేళ్ల జైలు
నల్లగొండ రెండో అదనపు జిల్లా కోర్టు తీర్పు
2021లో ఘటన..
దుకాణానికి వచ్చిన యువతిపై లైంగికదాడికి యత్నించిన వజ్జ శ్రీను
నల్లగొండ క్రైం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): లైంగికదాడికి యత్నించడంతోపాటు, బాధితురాలు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన నేరస్థుడికి నల్లగొండ రెండో అదనపు జిల్లా కోర్టు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక ప్రత్యేక న్యాయస్థానం నాలుగు జైలు శిక్షలను విధించింది. లైంగికదాడి యత్నానికి పదేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా, యువతి ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైనందుకు మరో పదేళ్ల జైలు, రూ.5వేల జరిమానా, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద యువతిపై లైంగికదాడి ప్రయత్నం, అత్మహత్య ప్రేరణ కింద పదేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా, యువతిని బలవంతంగా నిర్బంధించినందుకు ఏడాది జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయాధికారి ఎన్.రోజారమణి శుక్రవారం తీర్పునిచ్చారు. మొత్తం నాలుగు శిక్షలు విధించినా అన్నింటినీ ఏకకాలంలో అమలు చేయాలని పేర్కొనటంతో నేరస్థుడు వజ్జ శ్రీను 10 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
రూ.20వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కేసు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో దుకాణం నిర్వహించే వజ్జ శ్రీను అలియాస్ కార్తీక్ తన దుకాణానికి వచ్చిన ఒక యువతిపై లైంగికదాడికి ప్రయత్నించాడు. ఈ ఘటన అనంతరం, ఇంటికి వచ్చిన యువతి అవమాన భారంతో తల్లిదండ్రుల ఎదుటే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 జూన్ 29న ఆమె ప్రాణాలు విడిచారు. అదే ఏడాది జూలైలో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. నిందితుడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు, ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరుఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.శోభారాణి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.అఖిల వాదనలు వినిపించి నేరాన్ని నిరూపించడంతో.. న్యాయస్థానం వజ్జ శ్రీనుకు నాలుగు శిక్షలు విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News