Minister Uttam:ఏపీ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 05 , 2026 | 02:15 PM
పోలవరం- నల్లమల్ల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామని పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం- నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులను తాము అన్ని ఫోరమ్‌లలో వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు చూపిస్తున్న లేఖ ఈ ప్రాజెక్టులకు సంబంధించినది కాదని క్లారిటీ ఇచ్చారు. పోలవరం- నల్లమల్ల ఇంటర్ స్టేట్ రూల్స్‌కు వ్యతిరేకమని జీఆర్ఎంబీకి తామే లేఖ రాశామని ప్రస్తావించారు. తమ అభిప్రాయాన్ని జీఆర్ఎంబీ కూడా సమర్థించిందని గుర్తుచేశారు. ఇవాళ(సోమవారం) అసెంబ్లీ మీడియా పాయింట్‌లో చిట్ చాట్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
పోలవరం- నల్లమల్ల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలను బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామని పేర్కొన్నారు. ఈ కేసును వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసిందని తెలిపారు. రిట్ పిటిషన్‌లో కాదని.. సూట్ పిటిషన్‌లో రావాలని తమకు సుప్రీంకోర్టు సూచించిందని అన్నారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును వచ్చే సోమవారం కోరుతామని తెలిపారు. వచ్చే విచారణకు తాను కూడా ప్రత్యక్ష్యంగా హాజరవుతానని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఒకటి, రెండు రోజుల్లో మరోసారి న్యాయవాదులతో సమావేశం అవుతామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేశారని స్పష్టం చేశారు. గతంలో ఈ పథకం ఆగిపోయి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ఒత్తిడి వల్లే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపేసిందని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణ- గోదావరి జలాల్లో తెలివి ఎక్కువ.. పని తక్కువ అని చెప్పుకొచ్చారు. అతి తెలివితో బీఆర్ఎస్ తెలంగాణకు భారీ నష్టం చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో పాలమూరు - రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరాన్ని మార్చి భారీ నష్టం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలు చూసి, షేర్ చేస్తే కఠిన శిక్షలు.. పోలీసుల హెచ్చరిక
అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండ.. అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన భట్టి
Read Latest Telangana News And Telugu News