కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:43 AM
నిర్భయ నిధి కింద తెలంగాణ నుంచి ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై మంత్రి సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
న్యూఢిల్లీ, మార్చి 14: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవితో(Union Minister Annapurna Devi) రాష్ట్ర మంత్రి సీతక్క(Minister Seethakka) ఈరోజు(శనివారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మహిళలు, బాలికల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమాన్ని చేపట్టింది. నిర్భయ ఫండ్ కింద దేశవ్యాప్తంగా 10 జిల్లాలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై మంత్రి సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
నిర్భయ నిధి కింద ములుగు జిల్లాకు రూ.10 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లల సంరక్షణ కోసం గ్రామాల్లో క్రెష్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం క్రెష్ సెంటర్ వర్కర్లకు రూ.5,000 మాత్రమే వేతనం ఉండటంతో సిబ్బంది కొరత ఏర్పడుతోందని.. దీంతో వేతనాలు పెంచాలని కేంద్రమంత్రిని కోరినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల ఆర్థికాభివృద్ధికి క్రెష్ సెంటర్లు చాలా అవసరమని సీతక్క వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 1,000 క్రెష్ సెంటర్లు పనిచేస్తున్నాయని.. తక్కువ వేతనాల కారణంగా సిబ్బంది కొరత ఉందని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో 15,000 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో 2,000 అంగన్వాడీ భవనాల నిర్మాణం చేపడుతున్నామని, అంగన్వాడీ మౌలిక వసతుల కోసం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించామని వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పాలతో పాటు త్వరలో బ్రేక్‌ఫాస్ట్ కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రిటైర్డ్ అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షల వరకు బెనిఫిట్లు అందిస్తున్నామని.. కేంద్రం నుంచి అంగన్వాడీ వేతనాల్లో పెంపు అవసరమని మంత్రి సీతక్క వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ప్రత్యేక విమానంలో విశాఖకు పవన్.. నేతల స్వాగతం
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
Read Latest Telangana News And Telugu News