బీఆర్‌ఎస్ పోస్టులు.. కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు
ABN , Publish Date - Apr 13 , 2026 | 01:10 PM
అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క(Minister Seethakka) లీగల్ నోటీసు జారీ చేశారు. అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ కేసీఆర్‌కు(Former CM KCR) మంత్రి లీగల్ నోటీసు పంపారు. రిజిస్టర్డ్ పోస్టు ద్వారా కేసీఆర్‌కు ఈ నోటీసును సీతక్క తరపు అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ పంపించారు.
అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టీటీఎస్‌ఎల్) నిర్వహించిందని మంత్రి నోటీసులో తెలిపారు. టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి సీతక్క వివరించారు. మొత్తం టెండర్ విలువ రూ.44 కోట్లు మాత్రమే ఉన్నప్పటికీ, అందులో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమని, ఆధారాలు లేని ఆరోపణలని సీతక్క పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలని మంత్రి డిమాండ్ చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 48 గంటల్లో సోషల్ మీడియాలోని ఆ పోస్టులను తొలగించి.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలని నోటీసులో స్పష్టం చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీసులో మంత్రి సీతక్క హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
భారత్‌ను గ్లోబల్ మైనింగ్ లీడర్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: కిషన్ రెడ్డి
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News