మేం భారత చట్టాలనే పాటిస్తున్నాం
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:23 AM
తాము భారత చట్టాల ప్రకారం నడుచుకుంటూ పారదర్శకమైన విధానాలను అవలంబిస్తున్నామని కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు మెటా పాలసీ బృందం తెలిపినట్లు సమాచారం.
కాంగ్రెస్ పోస్టులను నియంత్రిస్తున్నారనే ఆరోపణలపై మెటా వివరణ
పార్టీ ప్రతినిధులతో మెటా బృందం భేటీ
హైదరాబాద్, నవంబరు 25: తాము భారత చట్టాల ప్రకారం నడుచుకుంటూ పారదర్శకమైన విధానాలను అవలంబిస్తున్నామని కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు మెటా పాలసీ బృందం తెలిపినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ యూత్ కాంగ్రెస్‌కు సంబంధించిన పోస్టులు ఖాతాలను మెటా నియంత్రిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. హైదరాబాద్, గురుగ్రామ్, ముంబైలోని మెటా కార్యాలయాల వెలుపల ఇండియన్ యూత్ కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో మెటా ప్రతినిధులు, కాంగ్రెస్ ప్రతినిధి బృందం భేటీ అయింది. చర్చల సందర్భంగా రాహుల్ గాంధీని ప్రస్తావించే పోస్టులను, మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టులను మెటా నియంత్రిస్తోందని చూపే ఆధారాలను కాంగ్రెస్ ప్రతినిధి బృందం సమర్పించింది.
శుక్రవారం హైదరాబాద్ మెటా కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, జాతీయ ఇన్‌చార్జి మనీశ్ శర్మల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను మెటా నిలిపివేసిందని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆరోపించారు. గచ్చిబౌలిలోని కార్యాలయంలోకి తమ కార్యకర్తలు వెళ్లి ప్రభావిత ఖాతాలను పునరుద్ధరించాలని మెటాను డిమాండ్ చేశారని తెలంగాణ యూత్ కాంగ్రెస్ తెలిపింది. కాగా బీజేపీకి మెటా అనుకూలంగా వ్యవహరిస్తోందని, నకిలీ వార్తలు, విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టడంలో విఫలమవుతోందని ఆరోపిస్తూ బెంగళూరులో యూత్ కాంగ్రెస్ ‘‘మెటా బీజేపీ కా బెటా’’ అనే నినాదంతో హోర్డింగులను ఏర్పాటు చేసింది. మెటా వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్‌ను ఆర్ఎస్ఎస్ దుస్తుల్లో చిత్రీకరించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్ వెస్లీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News