Share News

మేడిగడ్డ ఏడో బ్లాకు కూల్చి.. మళ్లీ కట్టాల్సిందే

ABN , Publish Date - Oct 15 , 2026 | 04:31 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఏడో బ్లాకును పూర్తిగా తొలగించి.. దాని స్థానంలో కొత్తగా కట్టుకోవడమే మేలని బ్యారేజీ సాంకేతిక పర్యవేక్షణ (ఓవర్‌ సైట్‌) కమిటీ నిర్ధారణకు వచ్చింది.

మేడిగడ్డ ఏడో బ్లాకు కూల్చి.. మళ్లీ కట్టాల్సిందే
Medigadda Barrage

  • సాంకేతిక పర్యవేక్షణ కమిటీ నిర్ణయం

  • అన్నారం, సుందిళ్ల ‘స్టిల్లింగ్‌’ విస్తరణ

  • డిజైన్లు వెట్టింగ్‌ చేయించాకే పనులు

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ఏడో బ్లాకును పూర్తిగా తొలగించి.. దాని స్థానంలో కొత్తగా కట్టుకోవడమే మేలని బ్యారేజీ సాంకేతిక పర్యవేక్షణ (ఓవర్‌ సైట్‌) కమిటీ నిర్ధారణకు వచ్చింది. బుధవారం న్యూఢిల్లీలోని జాతీయ డ్యామ్‌ భద్రతా సంస్థ (ఎన్డీఎ్‌సఏ) కార్యాలయంలో చైర్మన్‌ సమీర్‌ కుమార్‌ శుక్లా అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్‌, ఈఎన్సీ (జనరల్‌) ఓ.వి. రమేష్‌ బాబు, సంయుక్త కార్యదర్శి (సాంకేతిక) కె. శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. ప్రాథమిక డిజైన్లు, మూడు బ్యారేజీలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను తెలంగాణ అధికారులు కమిటీకి వివరించారు. బ్యారేజీల భద్రత, సాంకేతిక అంశాలపైనా చర్చించారు.


మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ‘స్టిల్లింగ్‌ బేసిన్‌’ (గేట్ల నుంచి దూకే నీటి వేగాన్ని తగ్గించి, బ్యారేజీ దిగువ భాగం కోతకు గురికాకుండా కాపాడే నిర్మాణం) విస్తరణ పనులు చేపట్టాలని కమిటీ స్పష్టం చేసింది. 2023 అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీలోని బ్లాక్‌-7 కుంగిపోవడం తెలిసిందే. దీంతో మరమ్మతుల డిజైన్లను పరిశీలించేందుకు సాంకేతిక పర్యవేక్షణ కమిటీని (టెక్నికల్‌ ఓవర్‌సైట్‌ కమిటీ--టీఓసీ) వేశారు. బ్లాక్‌--7లోని కొన్ని పిల్లర్లకు తీవ్ర పగుళ్లు ఏర్పడటంతోపాటు, రాఫ్ట్‌ భాగం నదీ గర్భంలోకి కుంగిపోయింది. దీంతో దెబ్బతిన్న భాగాలకు మరమ్మతులు చేయడం కంటే.. పూర్తిగా తొలగించి, మళ్లీ కొత్తగా నిర్మించడమే మేలన్న అభిప్రాయానికి కమిటీ భేటీలో వచ్చారు.


దెబ్బతిన్న పిల్లర్లను ‘డైమండ్‌ సా’తో కత్తిరించి తొలగించనున్నారు. ఇందుకు సంబంధించి డ్రాయింగ్‌లను 15 రోజుల్లోగా సిద్ధం చేయాలని.. డిజైన్లు వెట్టింగ్‌ చేయించుకున్న (నిపుణులతో పరిశీలన, ఆమోదం) తర్వాత పునర్‌నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. బ్లాక్‌-7లో దెబ్బతిన్న భాగాలను తొలగించి, మళ్లీ కట్టడానికి ఏడాది నుంచి రెండేళ్లదాకా సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణ డిజైన్లకు సూత్రప్రాయ ఆమోదం లభించినట్లు సమాచారం. ఈ బ్యారేజీల్లో స్టిల్లింగ్‌ బేసిన్‌ విస్తరణ, డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేపట్టాలని గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఉద్యోగం ఊడుద్ది.. జాగ్రత్త!

ఎకరానికి రూ.10 వేల పరిహారం

వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 15 , 2026 | 04:31 AM