Share News

తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు

ABN , Publish Date - Mar 09 , 2026 | 09:04 AM

తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. షాద్‌నగర్‌లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్న ల్యాబ్‌ను పోలీసులు గుర్తించారు.

తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు
Telangana Synthetic Drug Racket

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. షాద్‌నగర్‌లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్న గ్యాంగ్ కార్యకలాపాలను ఈగిల్ ఫోర్స్ దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో సంచలన విషయాలు బయటపడటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. దర్యాప్తులో భాగంగా ఎస్సార్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ ద్వారా డ్రగ్స్ తయారీలో ఉపయోగించే నిషేధిత రసాయనాలను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మెఫెడ్రోన్ తయారీలో ఉపయోగించే 2 బ్రోమో-4 మెథైల్ ప్రోపియోఫీనోన్ అనే రసాయనంతో పాటు, క్లోఫెడ్రోన్ తయారీలో ఉపయోగించే 3 క్లోరో-1 ఫెనైల్-1 ప్రోపనోన్ అనే కెమికల్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు.


ఈ వ్యవహారంలో ఎస్సార్ ఇన్నోవేషన్స్ డైరెక్టర్ షేక్ రఫీ కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. ఇండియా మార్ట్ ద్వారా రాజస్థాన్‌కు చెందిన నిందితులకు ఈ రసాయనాలను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన గ్యాంగ్ మూడు విడతల్లో దాదాపు 300 కిలోల రసాయనాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. నిందితులు తప్పుడు కంపెనీ పేర్లతో కెమికల్స్ కొనుగోలు చేసి షాద్‌నగర్‌లో అద్దె గదిని తీసుకుని అక్కడే డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. తయారు చేసిన డ్రగ్స్‌ను తిరిగి రాజస్థాన్‌కు తరలించి విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


ఈ గ్యాంగ్‌కు రాజస్థాన్‌కు చెందిన గిరీష్ థాపర్ అలియాస్ వీరేంద్ర స్వామి నాయకత్వం వహిస్తున్నాడు. నకిలీ పేర్లతో వ్యవహరిస్తూ డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడి సరుకును సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. గ్యాంగ్‌లో మనీష్ బిష్ణోయి, మనోజ్ మాథూర్, శిశుపాల్, సుమీత్, రాజు కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. ఈ కెమికల్స్ సరఫరాకు సంబంధించి లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.


ఈగిల్ పోలీసుల సమాచారంతో రాజస్థాన్ పోలీసులు వీరేంద్ర స్వామి, మనీష్ బిష్ణోయిని అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో షాద్‌నగర్‌లో నడుస్తున్న డ్రగ్ ల్యాబ్ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై NDPS చట్టంలోని సెక్షన్లు 21(C), 27A, 29, 30 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు మరికొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.


Also Read:

ప్రీమియం బారెడు క్లెయిమ్‌ మూరెడు!

నేనక్కడే ఉన్నా.. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు..!

For More Latest News

Updated Date - Mar 09 , 2026 | 09:04 AM