Share News

ప్రీమియం బారెడు క్లెయిమ్‌ మూరెడు!

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:35 AM

వేలకు వేలు పోసి ప్రైవేటు ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే ఏ మాత్రం ధీమా ఉండటం లేదు. మధ్యతరగతి ప్రజలకు ఆపత్కాలంలో అండగా ఉంటుందని నమ్మి కొనుగోలు చేసే ఆరోగ్య బీమా ఇప్పుడు పెను భారంగా మారుతోంది.

ప్రీమియం బారెడు క్లెయిమ్‌ మూరెడు!

  • 50-200శాతం పెరిగిన ఆరోగ్య బీమా ధరలుచికిత్సకు ఆస్పత్రికి వెళ్తే సగం క్లెయిమ్‌ కోత!

  • 43శాతం మంది రోగులకు ఇబ్బందులు.. 15 శాతం మంది క్లెయిమ్‌లు అకారణంగా తిరస్కరణ

  • బీమా ఉన్నా చేతి చమురు వదలాల్సిందే.. ముక్కుపిండి వసూలు చేస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రులు

  • డిశ్చార్జికి 6 నుంచి 48 గంటల సమయం.. ధీమానివ్వని ప్రైవేటు ఆరోగ్య బీమా.. సర్వేలో వెల్లడి

  • హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి (48 ఏళ్లు)కి ఓ ప్రముఖ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి రూ.15 లక్షలకు పాలసీ ఉంది. ఆయనకు గుండెనొప్పి రావడంతో పాలసీ ఉన్న ధీమాతో జూబ్లీహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండెకు స్టెంట్‌ వేశారు. ఆ తర్వాత రూ.5.23 లక్షల బిల్లు వేయగా.. బీమా కంపెనీ అందులో కేవలం రూ. 3.65 లక్షల క్లెయిమ్‌కు మాత్రమే ఓకే అంది. మిగిలింది సదరు ఉద్యోగి కట్టాల్సిందనేని ఆస్పత్రి డిమాండ్‌ చేసింది. చేసేదేమీ లేక చివరికి రూ.లక్షకు ఒప్పించి, అంత మొత్తాన్ని బాధితుడు చెల్లించాల్సి వచ్చింది.

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): వేలకు వేలు పోసి ప్రైవేటు ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే ఏ మాత్రం ధీమా ఉండటం లేదు. మధ్యతరగతి ప్రజలకు ఆపత్కాలంలో అండగా ఉంటుందని నమ్మి కొనుగోలు చేసే ఆరోగ్య బీమా ఇప్పుడు పెను భారంగా మారుతోంది. ఒకవైపు ఏటా భారీగా పెరుగుతున్న ప్రీమియంలు సామాన్యుల నడ్డి విరుస్తుంటే, మరోవైపు క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ సమయంలో ఆరోగ్య బీమా కంపెనీలు సృష్టించే అడ్డంకులు బాధితులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ‘లోకల్‌ సర్కిల్స్‌’ తాజాగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. గత మూడేళ్లల్లో (2023-2025) ఎక్కువ మందికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం 50 శాతం నుంచి 200 శాతం వరకు పెరిగింది. అయినప్పటికీ క్లెయిమ్‌ ప్రక్రియ మాత్రం ఇప్పటికీ చాలా కష్టంగా ఉంది. సర్వేలో పాల్గొన్న హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీదారుల్లో 10 మందిలో నలుగురికి పైగా క్లైయిమ్‌ చేసినప్పుడు, బీమా సంస్థలు తప్పుడు కారణాలు చూపిస్తూ క్లెయిమ్‌ను తిరస్కరించాయి. కొన్నిసార్లు కేవలం కొంత భాగమే ఆమోదించినట్లు సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు. అలాగే క్లెయిమ్‌ చేసిన పాలసీదారుల్లో ప్రతి పది మందిలో ఐదుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి ముందు క్లైయిమ్‌ ఆమోదం పొందడానికి కనీసం 6 నుంచి 48 గంటల సమయం పట్టిందని చెప్పారు. అలాగే రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి బీమా సంస్థ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు 24-48 గంటలు తీసుకున్నట్లు సర్వేలో వెల్లడైంది.


ప్రీమియంల మోత

గత మూడేళ్లలో ఆరోగ్య బీమా ప్రీమియంలు ఊహించని రీతిలో పెరిగాయని లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడించింది. 323 జిల్లాల్లోని సుమారు 54వేల మంది వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. దాదాపు 71శాతం మంది పాలసీదారుల ప్రీమియంలు 50శాతం నుంచి 200శాతం వరకు పెరిగాయి. కొవిడ్‌ తర్వాత ఇన్సూరెన్స్‌ కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి పాలసీ ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. 15శాతం మంది క్లెయిమ్స్‌ను కంపెనీలు సరైన కారణం లేకుండానే తిరస్కరించాయి. 29 శాతం మందికి క్లెయిమ్‌ చేసిన మొత్తంలో సగం లేదా అంతకంటే తక్కువ మాత్రమే మంజూరైంది.

డిశ్చార్జి కావాలంటే రోజంతా పడిగాపులు

ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ, డెవల్‌పమెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) నిబంధనల ప్రకారం క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌లను గంటలోపు ఆథరైజ్‌ చేయాలి. మూడు గంటల్లోపు డిశ్చార్జి ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. 50శాతం మంది పాలసీదారులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో 6 గంటల నుంచి 48 గంటల వరకు నిరీక్షించాల్సి వస్తోందని వాపోయారు. రోగి కోలుకున్నా, ఇన్సూరెన్స్‌ కంపెనీ క్లియరెన్స్‌ రాకపోవడంతో ఆస్పత్రి బెడ్‌ పైనే గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. 65 ఏళ్లు పైబడిన వృద్థులకు ప్రీమియం భారం రెట్టింపు అయింది. చాలా కంపెనీలు ‘కో-పే’ (ఖర్చులో కొంతభాగం పాలసీదారుడు భరించడం) నిబంధనను కఠినతరం చేశాయి. రోబోటిక్‌ సర్జరీలు వంటి ఆధునిక చికిత్సలకు క్లెయి మ్‌ ఇవ్వడానికి కంపెనీలు సతాయిస్తున్నాయని సర్వే పేర్కొంది. భారతీయులు ఆరోగ్య బీమా కోసం ఎక్కువ చెల్లిస్తూ తక్కువ ప్రయోజ నం పొందుతున్నారని లోకల్‌ సర్కిల్స్‌ వ్యవస్థాపకులు సచిన్‌ తపారియా అభిప్రాయపడ్డారు. ఐఆర్‌డీఏఐ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని చెబుతున్నా, దోపిడీకి అడ్డుకట్ట పడటంలేదు. ప్ర భుత్వం ఇప్పటికైనా స్పందించి క్లెయిమ్‌ తిరస్కరణలపై ప్రత్యేక ఆడిట్‌ నిర్వహించాలని సామాన్యులు డిమాండ్‌ చేస్తున్నారు.


ఆరోగ్య బీమా క్లెయిమ్‌-సెటిల్‌మెంట్‌ సర్వే - నివేదిక

ఐఆర్‌డీఏఐ పరిశ్రమ వర్గాల తాజా గణాంకాల ప్రకారం, 2024-26 కాలంలో ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సీనియర్‌ సిటిజన్లకు సంబంధించి కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2024లో మొుత్తం క్లెయిమ్‌లు 3 కోట్లకు పైగా నమోదయ్యాయి, వీటి విలువ సుమారు రూ.1.2 లక్షల కోట్లు. ఇందులో కేవలం 2.7 కోట్ల క్లెయిమ్‌లే పరిష్కరించారు. అంటే మొత్తం క్లెయిమ్స్‌లో ఇది 82ు మాత్రమే. విలువపరంగా చూస్తే 71.3శాతం విలువ గల క్లెయిమ్‌లే చెల్లించారు. కాగా సుమారు రూ.15,100 కోట్ల క్లెయిమ్‌లను బీమాసంస్థలు తిరస్కరించాయి. మరో రూ.10,937 కోట్లు వివాదాల్లో ఉన్నాయి. ఇక ఒక్కో క్లెయిమ్‌ సగటు విలువ రూ. 31,086గా ఉంది. 66.16శాతం క్లెయిమ్‌లు క్యాష్‌లెస్‌ పద్థతిలో జరిగాయి.

పెరుగుతున్న ఫిర్యాదులు

క్లెయిమ్‌ తిరస్కరణలు, జాప్యం, పాక్షికచెల్లింపుల కారణంగా 2025 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా ఫిర్యాదులు 41శాతం పెరిగి 1,37,361కి చేరుకున్నాయి. గత రెండేళ్లలో ఆరోగ్య బీమా ప్రీమియంలు తగ్గడానికి బదులు పెరిగాయి. వైద్య ద్రవ్యోల్బణం, అధిక క్లెయిమ్‌ ఖర్చులే దీనికి కారణమని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. సీనియర్‌ సిటిజన్ల పాలసీలపై వార్షిక ప్రీమియం పెరుగుదలను 10 శాతానికి పరిమితం చేస్తూ ఐఆర్‌డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్‌డీఏఐ ముందస్తు అనుమతి లేకుండా దీనికంటే ఎక్కువ పెంచకూడదు. గతంలో ఈ పెంపు 30-40శాతం వరకు ఉండేది, దీనివల్ల వృద్ధులకు బీమా భారం అయ్యేది. బీమా సంస్థలు ఏదైనా పాత ప్రొడక్ట్‌ను నిలిపివేయాలన్నా, మార్చాలన్నా ఐఆర్‌డీఏఐని సంప్రదించాలి.

Updated Date - Mar 09 , 2026 | 04:35 AM