Share News

సీట్లు పెరిగినా.. తగ్గనున్న వాటా

ABN , Publish Date - Nov 28 , 2026 | 04:45 AM

నియోజకవర్గాల పునర్విభజన ద్వారా రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచితే.. పార్లమెంటులో రాష్ట్రాల వాటాలు, శాతాలు మారిపోతున్నాయి.

సీట్లు పెరిగినా.. తగ్గనున్న వాటా

  • డీలిమిటేషన్‌ తర్వాత లోక్‌సభలో పలు రాష్ట్రాల ప్రాతినిధ్య వాటాల్లో తగ్గుదల

  • తెలుగు రాష్ట్రాలదీ అదే పరిస్థితి.. మహారాష్ట్ర, బిహార్‌ వాటాల్లోనూ తగ్గుదల

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన ద్వారా రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచితే.. పార్లమెంటులో రాష్ట్రాల వాటాలు, శాతాలు మారిపోతున్నాయి. ఎంపీల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. సభలో ఆయా రాష్ట్రాల వాటాల శాతం తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనాభా ఎక్కువగా ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరిగినా... సభలో వాటి ప్రాతినిధ్య వాటా తగ్గే అవకాశాలున్నాయి. మరోవైపు కొన్ని చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాతినిధ్య వాటా స్వల్పంగా పెరగనుంది. ప్రస్తుతం లోక్‌సభలో సభ్యుల సంఖ్య 543 ఉంది. 50 శాతం పెంచితే 816 అవుతుంది. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెరగనున్నాయి. ఈ లెక్కన చూస్తే.. తెలంగాణలో ప్రస్తుతం 17 ఎంపీ స్థానాలుండగా, 8.5సీట్లు పెరగాలి. కానీ, దానిని పూర్ణ సంఖ్యలోకి మారిస్తే 9 సీట్లు పెరుగుతాయి. అంటే రాష్ట్రంలో ఎంపీల సంఖ్య 17 నుంచి 26కు చేరుతుంది.


లోక్‌సభలో రాష్ట్ర ప్రాతినిధ్య వాటా ప్రస్తుతం 3.24 శాతం ఉంది. సీట్లు 26కు పెరిగినా ప్రాతినిధ్య వాటా మాత్రం 3.13 శాతానికి పడిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. 50 శాతం లెక్కన 13 సీట్లు పెరిగి 38కి చేరుతాయి. అయితే, లోక్‌సభలో ఏపీ ప్రాతినిధ్య వాటా మాత్రం 4.77 శాతం నుంచి 4.60 శాతానికి పడిపోతుంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 80 లోక్‌సభ సీట్లు ఉండగా.. పునర్విభజనతో 120కి చేరుతాయి. అయితే, లోక్‌సభలో ప్రస్తుతం యూపీ ప్రాతినిధ్య వాటా 15.27 శాతం నుంచి 14.72 శాతానికి పడిపోతుంది. బిహార్‌ వాటా 7.63 శాతం నుంచి 7.36 శాతానికి, మధ్యప్రదేశ్‌ వాటా 5.53 శాతం నుంచి 5.28 శాతానికి, గుజరాత్‌ వాటా 4.96 శాతం నుంచి 4.79 శాతానికి, పశ్చిమబెంగాల్‌ వాటా 8.02 శాతం నుంచి 7.73 శాతానికి పడిపోతుంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 19 ఎంపీ స్థానాలు ఉన్నాయి. పెంపు తర్వాత 32కు చేరుకుంటాయి. అప్పుడు లోక్‌సభలో వాటి వాటా 3.50 శాతం నుంచి 3.92 శాతానికి పెరుగుతుంది.


ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో మూడు చొప్పున లోక్‌సభ సీట్లు పెరుగుతున్నాయి. చండీగఢ్‌, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌, దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూ, లక్షద్వీ్‌పలో ఒక్కో ఎంపీ సీటు చొప్పున పెరుగుతాయి. లడఖ్‌కు కొత్తగా ఒక ఎంపీ స్థానం ప్రతిపాదించారు. సభలో వాటి ప్రాతినిధ్య వాటాలు కూడా పెరుగుతాయి. చండీగఢ్‌, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌, దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూ, లక్షద్వీ్‌పల వాటా 0.19 శాతం చొప్పున ఉండగా... 0.25శాతానికి పెరుగుతాయి. ఢిల్లీలో ఎంపీ సీట్లు 7 నుంచి 10కి చేరుకుంటాయి. ప్రస్తుతం లోక్‌సభలో ఢిల్లీ ప్రాతినిధ్య వాటా 1.34 శాతం ఉండగా.. అది 1.23 శాతానికి తగ్గిపోతోంది. 3ఎంపీ సీట్లు పెరిగినా...ప్రాతినిధ్య వాటా 0.11శాతం తగ్గుతుండటం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 28 , 2026 | 04:45 AM