Share News

కోడంగల్ ఎత్తిపోతల టెండర్లపై కేటీఆర్ సంచలన ఆరోపణలు.. ప్రాజెక్టు వ్యయం రూ.6,825 కోట్లకు ఎలా పెరిగింది?

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:03 PM

కోడంగల్, నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల పథకం టెండర్లలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి ప్రయోజనం చేకూర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.

కోడంగల్ ఎత్తిపోతల టెండర్లపై కేటీఆర్ సంచలన ఆరోపణలు.. ప్రాజెక్టు వ్యయం రూ.6,825 కోట్లకు ఎలా పెరిగింది?
BRS MLA KTR

హైదరాబాద్, నవంబర్ 11: కోడంగల్, నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల పథకం టెండర్లలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి ప్రయోజనం చేకూర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును శనివారం సోషల్ మీడియా వేదికగా ఆయన ఎండగట్టారు. సదరు ఎత్తిపోతల పథకానికి రేవంత్ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తే.. మంత్రి పొంగులేటికి చెందిన కంపెనీ అందులో పాల్గొందని విమర్శించారు. ఈ టెండర్లలో పాల్గొన్న మిగతా కంపెనీలన్నీ కేవలం కాగితాలపై ఉన్న నామమాత్రపు సంస్థలని తెలిపారు. చివరకు ఒక్క కంపెనీ మాత్రమే పోటీలో మిగిలి విజయం సాధించేలా వ్యవహారం నడిచిందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1,450 కోట్ల నుంచి రూ.6,825 కోట్లకు పెరిగిందని వివరించారు. వ్యయం ఇంత భారీగా పెరగడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


2014లో సుమారు రూ.1,450 కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ.6,825 కోట్లకు చేరిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వివరించారు. ఈ ప్రాజెక్టు వ్యయం ఐదు రెట్లు పెరిగిందని సోదాహరణగా చెప్పారు. ప్రజాధనాన్ని ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీరు కూడా ప్రజలకు అందలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పేరుతో అంచనా వ్యయాన్ని భారీగా పెంచుతూ, టెండర్ల ప్రక్రియను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ప్రభుత్వంపై అగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లలో పారదర్శకతకు తావు లేకుండా, తమకు అనుకూలమైన కంపెనీలకే పనులు దక్కేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు.


ఓ వైపు తెలంగాణలో ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరిగారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రాజెక్టుల అంచనా వ్యయాలను పెంచి కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రభుత్వంలోని నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు.


ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇలాంటి దోపిడీకి సరిపోయే కొత్త పదాన్ని సూచించాలని ఆయనకు స్పష్టం చేశారు. క్రోనీ క్యాపిటలిజం, బహిరంగ దోపిడీ, క్లెప్టోక్రసీ వంటి పదాలు కూడా తెలంగాణలో జరుగుతున్న దోపిడీని వివరించడానికి సరిపోవడం లేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ, టెండర్ల ప్రక్రియలోనూ తమకు అనుకూలమైన కంపెనీలకే ప్రయోజనం చేకూర్చే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తప్పుబట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర..

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 01:24 PM