బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: కేటీఆర్
ABN , Publish Date - May 17 , 2026 | 04:59 PM
పోక్సో చట్టం కింద బండి భగీరథ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాని మోదీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మే 17: పోక్సో చట్టం కింద బండి భగీరథ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాని మోదీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎల్ బీ నగర్‌లో నిర్వహించిన ‘నా బూత్.. నా భవిష్యత్తు’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రధాని మోదీ ‘బేటీ పడావో.. బేటీ బచావో’ అంటున్నారన్నారు. కేవలం ఇది నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదని పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారి కేంద్రమంత్రి కుమారుడి మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చిందని చెప్పారు.
బండి సంజయ్‌ను కేంద్రమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయకపోతే ఈ కేసు విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు చేసిన కొడుకుని తొమ్మిది రోజులు దాచి పెట్టారంటూ కేంద్రమంత్రి సంజయ్‌పై ఆయన నిప్పులు చెరిగారు. సంజయ్ లాంటి వ్యక్తి పదవిలో కొనసాగడం తెలంగాణకే కాదు.. భారతదేశానికి కూడా అవమానకరమన్నారు. కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికకు అన్యాయం చేశాడని విమర్శించారు. మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని స్వయాన కేంద్ర మంత్రి భయభ్రాంతులకు గురిచేశారని గుర్తు చేశారు.
ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఆరోపించారు. హనీ ట్రాప్ అని, మీడియాను మనీ ట్రాప్‌లో వేసి.. సీఎం రేవంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఇద్దరూ మీడియాలో వార్తలు రానీవ్వకుండా చేశారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి పదవి నుంచి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే తన మీద అఘాయిత్యం జరిగినా ముందుకు వచ్చే ధైర్యం ఏ ఆడబిడ్డ చేయదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే బండి సంజయ్‌ను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించి.. ఈ కేసు విచారణను నిష్పక్షపాతంగా జరిపించాలని కేంద్రానికి ఆయన స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి ఎన్ని రకాలుగా బెదిరింపులు, ఒత్తిళ్లు తెచ్చినా బాధిత బాలికకు తల్లి అండగా నిలబడిందన్నారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరూ కుమ్మక్కై ఆ అమ్మాయికి అన్యాయం చేయాలనుకున్నా.. ఆ తల్లిదండ్రులు వెనకడుగు వేయలేదని తెలిపారు. బాలిక తరపున పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగానికి ఈ సందర్భంగా కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా ఈ కేసులో చాలా గట్టిగా కొట్లాడారని గుర్తు చేశారు. బండి భగీరథ్ లొంగిపోయాడు, అరెస్టయ్యాడంటూ డ్రామా నడుస్తున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అబద్ధాలు, అసత్యాలు వండివారుస్తున్న వైసీపీ నేతలు: దేవినేని ఉమా
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్‌పై..
For More TG News And Telugu News