Share News

కేటీఆర్ ప్రకటన.. ఆ పోటీలకు దూరంగా ఉండాలని నిర్ణయం..

ABN , Publish Date - Mar 28 , 2026 | 07:29 AM

ప్రజా సమస్యలు పెండింగ్‌లో ఉండగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు అవసరమా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని రంగాలు సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో క్రీడల్లో పాల్గొని సమయం వృథా చేయడం తగదని హితబోధ చేశారు.

కేటీఆర్ ప్రకటన.. ఆ పోటీలకు దూరంగా ఉండాలని నిర్ణయం..
BRS Working President KTR

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా శని, ఆదివారాల్లో వారికి పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లెజిస్లేచర్‌ స్పోర్ట్స్‌ మీట్‌-2026 ప్రారంభం కానుంది. అయితే, ఈ పోటీల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పుకొచ్చారు. తమ సభ్యులంతా క్రీడా పోటీలకు దూరంగా ఉండనున్నారని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.


ప్రజా సమస్యలు పెండింగ్‌లో ఉండగా క్రీడా పోటీలు అవసరమా? అంటూ కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని రంగాలు సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో క్రీడల్లో పాల్గొని సమయం వృథా చేయడం తగదని హితబోధ చేశారు. శాసనసభను కనీసం ఇంకో 10 రోజులు కొనసాగించి ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి, అసెంబ్లీని వాయిదా వేసి క్రీడలు నిర్వహించడాన్ని ప్రజలు సమర్థించరని మండిపడ్డారు. ప్రభుత్వం క్రీడా పోటీలపై పునరాలోచన చేయాలని.. ఎమ్మెల్యేలు క్రీడలు ఆడి ఒలింపిక్స్‌కి వెళ్లేదేమీ లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.


క్రీడలను ప్రోత్సహించాలంటే పిల్లలకు అవకాశాలు కల్పించి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆటలు ఆడించడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. శాసనసభను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత రెండ్రోజులపాటు క్రీడలు నిర్వహించుకోవచ్చని అన్నారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదంటూ కేటీఆర్ మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

హవాయిలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ముగ్గురు మృతి

గోల్డ్, సిల్వర్ ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 28 , 2026 | 07:43 AM