Share News

ఏపీలో పెట్రోలు, డీజిల్‌ కొరత లేదు

ABN , Publish Date - Mar 28 , 2026 | 06:12 AM

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌ కొరత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణంగా తలెత్తిన పరిస్థితులపై శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ దేశంలోని...

ఏపీలో పెట్రోలు, డీజిల్‌ కొరత లేదు

  • వంటగ్యాస్‌ కోసం ప్యానిక్‌ బుకింగ్‌తో సమస్యలు: సీఎం

  • పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం

  • పీఎన్‌జీ కనెక్షన్లను ప్రోత్సహిస్తున్నాం

ప్రధాని వీడియోకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు

అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌ కొరత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణంగా తలెత్తిన పరిస్థితులపై శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ దేశంలోని అందరు సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ఇంధన పరిస్థితిని వివరించారు. ఎల్‌పీజీ సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని, ప్యానిక్‌ బుకింగ్‌తో సమస్యలు వస్తున్నాయని ప్రధానికి తెలిపారు. రాష్ట్రంలో పీఎన్‌జీ కనెక్షన్లను ప్రోత్సహిస్తున్నామన్నారు. సప్లయ్‌ చైన్‌ దెబ్బతినకుండా అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు ప్రత్యక్షంగా ప్రజలకు లబ్ధి కలిగించకపోయినా చమురు కంపెనీలకు ఊరట కలిగిస్తుందని.. తద్వారా అవి ప్రజలపై భారం మోపకుండా ఉంటాయని వ్యాఖ్యానించారు.


మిషన్‌ కర్మయోగిలో ఏపీ సత్తా

‘మిషన్‌ కర్మయోగి’లో రాష్ట్రం జాతీయస్థాయిలో ఆదర్శంగా నిలిచిందని సీఎం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపునకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ఉద్యోగులు కోటి పైచిలుకు కోర్సులను పూర్తి చేయడంపై ఆయన స్పందించారు. టెక్నాలజీ ఆధారిత శిక్షణతో పాలనలో మెరుగైన ఫలితాలు లభిస్తాయన్నారు. ఏప్రిల్‌ 2 నుంచి 8 వరకు నిర్వహించే ‘సాధన సప్తాహ్‌’ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ పాల్గొనాలని పిలుపిచ్చారు.


ఎన్డీయేదిప్రజాపక్షమని మరోసారి నిరూపణ

కష్టకాలంలోనే అసలైన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాలు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ సీఎం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘దేశానికి సుస్థిర పాలన అందిస్తున్న ప్రధాని, అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నా భారత్‌కు బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. ఎక్సైజ్‌ సుంకా ల తగ్గింపు.. ప్రజలపై భారం తగ్గించే ప్రజాహిత చర్య. ఇతర దేశాలు ధరలు పెంచుతుంటే భారత్‌ మాత్రం ప్రజల పక్షాన నిలిచింది. ఎన్డీయే ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించుకుంది’ అని పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించిన ప్రధానికి మంత్రి లోకేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఉపశమనం కలిగించేలా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజాసంక్షేమ ప్రభుత్వమని ఎన్డీయే నిరూపించుకుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 06:16 AM