Share News

క్యాన్సర్‌ కమ్మేస్తోంది

ABN , Publish Date - Mar 28 , 2026 | 06:00 AM

రాష్ట్రంలో క్యాన్సర్‌ బాధితుల సంఖ్య రోజురోజుకి అధికమవుతోంది. 2030 నాటికి ఈ తీవ్రత మరింత పెరగనుందని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) తాజా నివేదిక హెచ్చరిస్తోంది.

క్యాన్సర్‌ కమ్మేస్తోంది

  • రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న కేసుల సంఖ్య

  • ప్రతి 8 మంది పురుషుల్లో ఒకరికి..ఆరుగురు మహిళల్లో ఒకరికి వచ్చే ముప్పు

  • చిన్నారుల్లోనూ పెరుగుతున్న కేసులు

  • కలవరపెడుతున్న ఐసీఎంఆర్‌ నివేదిక

  • పురుషుల్లో నోరు, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితులే అధికం

  • మహిళల్లో ఎక్కువ మంది బ్రెస్ట్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌ బాధితులే

హైదరాబాద్‌ సిటీ, మార్చి27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్యాన్సర్‌ బాధితుల సంఖ్య రోజురోజుకి అధికమవుతోంది. 2030 నాటికి ఈ తీవ్రత మరింత పెరగనుందని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) తాజా నివేదిక హెచ్చరిస్తోంది. నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌(ఎన్‌సీఆర్‌పీ) ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఐసీఎంఆర్‌.. క్యాన్సర్‌ బర్డెన్‌ ప్రొఫైల్‌-2026 అనే నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రతీ ఎనిమిది పురుషుల్లో(19 ఏళ్ల పైబడిన వారు) ఒకరికి, ప్రతీ ఆరుగురు మహిళల్లో(19 ఏళ్ల పైబడినవారు) ఒకరికి క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. అలాగే, 2026, 2030 నాటికి రాష్ట్రంలో ఎన్ని క్యాన్సర్‌ కేసులు ఉంటాయని ఈ నివేదిక అంచనా వేసింది. హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి భువనగరి, సిద్దిపేట జిల్లాల్లోని క్యాన్సర్‌ ఆస్పత్రుల నుంచి సేకరించిన కేసుల సమాచారం ఆధారంగా ఐసీఎంఆర్‌ ఈ నివేదికను రూపొందించింది. క్యాన్సర్‌ బర్డెన్‌ ప్రొఫైల్‌ నివేదిక ప్రకారం.. 2026లో తెలంగాణలో కొత్తగా 46,762 క్యాన్సర్‌ కేసులు నమోదయ్యే అవకాశముంది. ఇందులో పురుషులు 21,252, మహిళలు 25,510 మంది ఉండనున్నారు. ఏడాదిలో 46,762 కేసులు అంటే రోజుకు సగటున 128 కొత్త కేసులు అన్నమాట. అలాగే, 2030లో 47,314 కొత్త కేసులు నమోదవుతాయ్యే అవకాశముంది. ఇందులో పురుషులు 21,473, మహిళలు 25,841 మంది ఉండనున్నారు. అలాగే, 0-19 ఏళ్ల లోపు పిల్లల్లో 2026లో 1,199 క్యాన్సర్‌ కేసులు కొత్తగా నమోదవుతాయని అంచనా. ఇందులో బాలురు 628 మంది, బాలికలు 571 మంది ఉండే అవకాశముంది. 2030లో ఈ కేసుల సంఖ్య 1216కు చేరుతుందని అంచనా. ఇందులో 638 బాలురు, 578 మంది బాలికలు ఉండనున్నారు.


పురుషుల్లో నోటి క్యాన్సర్‌.. మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌

ప్రస్తుతమున్న గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని పురుషుల్లో ఎక్కువ మంది నోటి క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. మొత్తం కేసుల్లో నోటి క్యాన్సర్‌ కేసుల సంఖ్య 21.7 శాతంగా ఉండడం గమనార్హం. ఆ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్‌(10.5 శాతం), కొలన్‌ క్యాన్సర్‌(7.9 శాతం) బాధితులు అధికంగా ఉంటున్నారు. రాష్ట్రంలో క్యాన్సర్‌ బారిన పడిన పురుషుల్లో 58.8 శాతం మంది పొగాకు అలవాటు వల్లే నోటి, నాలుక, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు గురయ్యారు. మద్యం పానం అలవాటు కూడా పలురకాల క్యాన్సర్లకు కారణమవోతుంది. రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 43.3 శాతం మంది మద్యపానం చేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, మహిళల్లో బ్రెస్ట్‌(రొమ్ము) క్యాన్సర్‌ కేసులు అధికంగా ఉంటున్నాయి. మొత్తం కేసుల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులు 36.2 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి. క్యాన్సర్‌ నిర్ధారణ అయిన ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బాధితులు ఉండడం గమనార్హం. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ తర్వాత మహిళల్లో సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసులు 8.1 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి. పిల్లల్లో రక్త క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది.

ప్రాణాలు తీస్తున్న ఆలస్యం

ప్రజలకు సరైన అవగాహన లేక స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించుకోక రాష్ట్రంలో క్యాన్సర్‌ నిర్ధారణ చాలా ఆలస్యంగా జరుగుతోంది. చాలా కేసుల్లో వైద్యుడిని ఆశ్రయించే సరికే రోగి శరీరంలో క్యాన్సర్‌ తీవ్ర స్థాయికి చేరుతుంది. దీంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు. చివరికి రోగి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌కు మహిళలు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో 30 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు ఉన్న మహిళల్లో కేవలం 0.3 శాతం మంది మాత్రమే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష చేయించుకున్నారని, 3.3 శాతం మందే సర్వైకల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ చేయించుకున్నారని గణాంకాలు చెబుతుండడం ఆందోళన కలిగించే అంశం.


క్యాన్సర్‌ చికిత్సకు ఒకేఒక్క ప్రభుత్వ ఆస్పత్రి

క్యాన్సర్‌ చికిత్స అందించేందుకు రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ రంగంలో ఒకేఒక్క ఆస్పత్రి ఉంది. ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజీ మాత్రమే రాష్ట్రంలో ప్రాంతీయ క్యాన్సర్‌ కేంద్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలకు సంబంధించిన రిజిస్ట్రీ కూడా ఎంఎన్‌జేలోనే ఉంది. ఇక, రాష్ట్రంలో పాలియేటివ్‌ కేర్‌ సెంటర్లు కేవలం 59 మాత్రమే ఉన్నాయి. ఈ కేంద్రాల్లో క్యాన్సర్‌కు చికిత్స అందించడం కంటే రోగికి ఉపశమనం కల్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. రోజురోజుకి రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మౌలిక సదుపాయాలు రోగుల అవసరాలను తీర్చగలవా ? లేదా ? అనేది పెద్ద ప్రశ్న.

క్యాన్సర్‌ కేసుల నమోదుపై దృష్టి

క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు అవగాహన కార్యక్రమాలు, స్ర్కీనింగ్‌ సేవలు విస్తరించడం అత్యవసరం. క్యాన్సర్‌ను నోటిఫైడ్‌ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. నోటిఫైడ్‌ చేయడం వల్ల క్యాన్సర్‌ కేసులపై స్పష్టత వస్తుంది, ఎంత మంది క్యాన్సర్‌ బాధితులు ఉన్నారో తేలుతుంది. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్‌ కేసుల నమోదు, డేటా విశ్లేషణ, సమగ్ర నివారణ చర్యలను బలోపేతం చేయాలని నిర్ణయించాం. క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలి. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్సతో సమస్యను పరిష్కరించే అవకాశం అధికంగా ఉంటుంది

- డాక్టర్‌ సదాశివుడు గుండేటి, క్యాన్సర్‌ రిజిస్ట్రీ ప్రిన్సిపాల్‌ ఇన్వెస్టిగేటర్‌

Updated Date - Mar 28 , 2026 | 06:00 AM