అనుమతులు లేకుండా నిర్మాణాలు జరపొద్దు
ABN , Publish Date - Nov 20 , 2026 | 04:30 AM
కృష్ణా బేసిన్‌లో అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టరాదని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఏపీ, తెలంగాణలకు గుర్తు చేసింది.
కొత్తగా ఏ ప్రాజెక్టు కట్టాలన్నా డీపీఆర్‌ను మేం పరిశీలించాలి..
కేంద్రస్థాయిలో పలు అనుమతులు తీసుకోవాలి
కేటాయించని జలాలపై ప్రాజెక్టు నిర్మించినా హక్కు లభించదు
ప్రాజెక్టులను అడ్డుకునే అధికారం మాకు లేదు
తెలంగాణ, ఏపీలకు కృష్ణాబోర్డు లేఖ
కృష్ణా, గోదావరి జలాల్లో చుక్కనీటినీ వదులుకోం
బీఆర్‌ఎస్ ఆరోపణలు అర్థరహితం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, హుజూర్‌నగర్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌లో అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టరాదని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఏపీ, తెలంగాణలకు గుర్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 లోని 11వ షెడ్యూల్ ప్రకారం కొత్తగా ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నా... ఆ ప్రాజెక్టు డీపీఆర్ (ప్రాజెక్టు పూర్తి నివేదిక)ను తాము మదింపు చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. దీంతోపాటు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) క్లియరెన్స్‌లు, సాంకేతిక సలహా మండలి(టీఏసీ) సాంకేతిక అనుమతి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. కేటాయించని జలాల ఆధారంగా లేదా మిగులు జలాలు అందుబాటులో ఉంటాయన్న అంచనాతో ప్రాజెక్టులను నిర్మించినంత మాత్రాన ఆయా రాష్ట్రాలకు ఆ నీటిని వినియోగించుకునే హక్కు లభించదని స్పష్టం చేసింది.
ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు బోర్డు గురువారం లేఖ రాసింది. సాగర్ కుడివైపు ఏపీ నిర్మిస్తున్న ఇంటేక్‌వెల్స్‌ను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై స్పందిస్తూ... అనుమతులు లేకుండా చేపట్టే ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకునే విషయంలో బోర్డుకు కొన్ని పరిమితులు ఉన్నాయని, ఆ విధంగా నిర్మాణాలు చేపట్టరాదని సూచనలు మాత్రం చేయగలమని తెలిపింది. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని 2021 జూలై 15వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఒక వైపు బోర్డుకు ప్రాజెక్టులను నియంత్రించే అధికారాల్లేవని సుప్రీంకోర్టులో పేర్కొంటూ.. మరోవైపు, అనుమతి లేని ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవాలని బోర్డును కోరడం పరస్పర విరుద్ధమైన చర్య అని పేర్కొంది.
బోర్డులో నిర్ణయాలన్నీ ఏకాభిప్రాయంతో తీసుకునేవేనని, ఏకాభిప్రాయం లేనప్పుడు ఆ సమస్య అసంపూర్ణంగానే మిగిలిపోతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 పదకొండో షెడ్యూల్‌లోని నిబంధన-9 ప్రకారం.. నిర్ణయాలు అమలు చేయడంలో బోర్డు విఫలమైతే, తదుపరి చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపింది. ఇన్ని సంక్లిష్టతల నేపథ్యంలో బోర్డు ముందస్తు అనుమతులు, సాంకేతిక పరిశీలన లేకుండా కొత్త ప్రాజెక్టులను చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఏపీలోని పల్నాడు జిల్లా ఇపూరు మండలం కొచ్చెర్ల గ్రామం, పరిసర ప్రాంతాల రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యపై కేఆర్‌ఎంబీ స్పందించింది. సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులు ఈనెల 4న ఈమెయిల్ ద్వారా కృష్ణాబోర్డుకు వినతిపత్రం సమర్పించారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన బోర్డు ఈ నెల 18న ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్‌కు పంపించింది. తాజాగా దీనిపై స్పందిస్తూ.. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు, వాటి కాలువ వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా నిర్దిష్ట ప్రాంతానికి నీటిని విడుదల చేయాలని కేఆర్‌ఎంబీ స్వతంత్రంగా ఆదేశించే స్థితిలో లేదని స్పష్టం చేసింది.
చుక్కనీటినీ వదులుకోం
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను ఒక్క చుక్క కూడా వదులుకునే ప్రసక్తి లేదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, నూతన పింఛన్‌దారులకు మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. అనంతరం ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ ప్రభుత్వం 1.8 టీఎంసీల నీటిని తరలించే యత్నాన్ని అడ్డుకున్నామన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో కృష్ణా, గోదావరి నీటిని సక్రమంగా వినియోగించలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ జలాలను ఎక్కువగా ఉపయోగించుకుని తెలంగాణను సస్యశ్యామలం చేశామని ఉత్తమ్ పేర్కొన్నారు. భారత వైమానిక దళంలో యుద్ధ విమానాలకు పైలట్‌గా పట్టుదల, క్రమశిక్షణ, ధైర్యంతో పనిచేశానని, ఇప్పుడు కృష్ణా, గోదావరి నీటి హక్కుల విషయంలోనూ అదే విధంగా చిత్తశుద్ధితో పోరాడుతున్నానని తెలిపారు. సాగునీటి విషయంలో బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమైనవని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు వారి హయాంలోనే పగుళ్లు వచ్చాయన్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం
‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
Read latest Telangana News And Telugu NEws