కొత్తగూడెం విమానాశ్రయానికి పచ్చజెండా!
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:49 AM
రాష్ట్రంలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టుకు కేంద్ర విమానయాన శాఖ పచ్చజెండా ఊపింది.
సుజాతనగర్ వద్ద 667 ఎకరాల్లో ఏర్పాటుకు ఆమోదం..
ఆరు ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి తుది ఎంపిక
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం
ఇక భూసేకరణ, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టుకు కేంద్ర విమానయాన శాఖ పచ్చజెండా ఊపింది. జిల్లాలోని సుజాతనగర్ వద్ద సుమారు 667 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనితో కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టు కోసం ఏళ్లనాటి కలలు సాకారం కానున్నాయి. నిజానికి ఈ జిల్లాలోని పెనగడప, పాల్వంచ-దమ్మపేట, చాపరాలపల్లి, దుమ్ముగూడెం, సుజాతనగర్, సీతంపేట ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు భూమి లభ్యత, రన్ వే, ఎత్తు పరిమితి, చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలు, వరదల సమయంలో పరిస్థితులు సహా పలు అంశాలపై సర్వేలు నిర్వహించారు.
చివరికి సుజాతనగర్ అనువుగా ఉంటుందని నిర్ణయించినట్టు తెలిసింది. కేంద్రం నుంచి అనుమతి రావడంతో భూసేకరణ, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. సుజాతనగర్ దగ్గర ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు ప్రాంతం నుంచి ప్రధాన రహదారి 3.4 కిలోమీటర్లు, కొత్తగూడెం రైల్వే స్టేషన్ 5.7 కిలోమీటర్లు, భద్రాచలం 35.4 కిలోమీటర్లు, సింగరేణి ప్రాంతానికి 32.3 కిలోమీటర్ల దూరం ఉండనుంది. అలాగే అభయారణ్యం 7.4 కిలోమీటర్ల దూరం ఉందని నివేదికలో పేర్కొన్నారు. భద్రాద్రి ప్రాంతంలో గతంలో వచ్చిన వరదలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. 1986లో తీవ్ర వచ్చిన వరదలు వచ్చిన ప్రాంతానికి 23.1 కిలోమీటర్లు, 2022లో వచ్చిన భారీ వరదలకు 25.5 కి.మీ దూరంలో సుజాతనగర్ ఉందని సర్వే నివేదికల్లో పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటికే వరంగల్ మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల పనులు మొదలవగా, ఇప్పుడు కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు మార్గం సుగమమైంది. దీనితో శంషాబాద్, బేగంపేట కలిపి రాష్ట్రంలో విమానాశ్రయాలు 5కు చేరనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News