కొండా కుటుంబం దారెటు?
ABN , Publish Date - Sep 04 , 2026 | 05:14 AM
కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కొండా కుటుంబం దారెటన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.
బీఆర్‌ఎస్‌లో ఇమిడే పరిస్థితి లేదు
బీజేపీ నుంచి లేని ఆహ్వానం
ఏ పార్టీ అండ లేకుండా గెలుస్తారా?
రాజకీయ వర్గాల్లో చర్చ
పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై అస్పష్టత
హైదరాబాద్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కొండా కుటుంబం దారెటన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. కొండా సుస్మిత వ్యాఖ్యలతో వివాదం చెలరేగిన దగ్గర్నుంచీ కొండా సురేఖ, మురళీలు మొదట ఏ స్టాండ్ పైన అయితే ఉన్నారో.. చివరి వరకూ అదే కొనసాగించారు. పైగా ప్లాన్ బీ పైన కొండా మురళీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి వివాదం మొదలైనప్పుడే వారు ప్లాన్ బీ సిద్దం చేసుకుని ఉన్నారని స్పష్టమవుతోంది. అయితే ఆ ప్లాన్ బీ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసరడమే ప్లాన్ బీయా? అన్న చర్చ నడుస్తోంది. కొండా సురేఖ ఉప ఎన్నికల్లో గెలవాలన్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబం రాజకీయంగా మనుగడ కొనసాగించాలన్నా ఏదో ఒక ప్రధాన పార్టీ అండ అవసరమని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. కొండా సురేఖను కాంగ్రెస్ ఏకంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో ఆ పార్టీలో గతంలో ఉన్న గౌరవం ఇక ముందు ఉండే అవకాశం లేదు. అలాగే, రాష్ట్ర విభజన నేపథ్యంలో వైసీపీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కొండా సురేఖ, మురళిలు 2018 ఎన్నికల ముందు ఆ పార్టీని వీడారు. ఆ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసి వచ్చారు. ఈ నేపథ్యంలో కొండా కుటుంబం బీఆర్‌ఎస్ పార్టీలో చేరే అవకాశాలు లేవని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొండా సురేఖ, మురళిలను పార్టీలో చేర్చుకునే విషయంలో బీజేపీ సానుకూలంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర నేతలు పలువురు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా దంపతులు ఒక వైఖరిని తీసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చునని చెబుతున్నారు. నియోజకవర్గంలోని తమ అనుచరులతో సమాలోచనలు, ఇతర పార్టీల నుంచి ప్రతిపాదనలను బట్టి ఒక వైఖరి తీసుకుంటారని చెబుతున్నారు. కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత కొండా మురళి మీడియా ముందుకు వచ్చి మీసం తిప్పడం ఆసక్తి కలిగించే అంశంగానూ చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అధిష్ఠానానికి రేవంత్ బ్లాక్‌మెయిల్!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News