Share News

డ్రగ్స్‌ నుంచి యువశక్తిని కాపాడుకుందాం

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:15 AM

కొంతమంది దుర్మార్గులు, దేశద్రోహులు అమాయక యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తున్నారని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

డ్రగ్స్‌ నుంచి యువశక్తిని కాపాడుకుందాం

  • విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్‌ ముఠాలు

  • అందరం కలిసి డ్రగ్స్‌ తయారీ, సరఫరాదార్ల అంతు చూద్దాం

  • ‘నషా ముక్త్‌ భారత్‌’ పాదయాత్ర లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

  • అంబర్‌పేట నుంచి యాత్ర షురూ.. తొలిరోజు 13 కి.మీ.

  • డ్రగ్స్‌కు నో.. జీవితానికి ఎస్‌ చెప్పండి: సినీ నటుడు వెంకటేష్‌

హైదరాబాద్‌ సిటీ/ ఉస్మానియా యూనివర్సిటీ/ బర్కత్‌పురా, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కొంతమంది దుర్మార్గులు, దేశద్రోహులు అమాయక యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తున్నారని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠశాలలు, కాలేజీలు, బస్తీలు, ఆఫీసుల్లో చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో మత్తుపదార్థాలను విక్రయిస్తూ భవిష్యత్‌ తరాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కిషన్‌రెడ్డి తలపెట్టిన మూడు రోజుల ‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషా ముక్త్‌ భారత్‌’ పాదయాత్ర బుధవారం అంబర్‌పేట్‌లో ప్రారంభమైంది. సినీ నటుడు వెంకటేష్‌ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ దేశంలోనూ లేనివిధంగా మన దేశ జనాభాలో 25 శాతానికి పైగా విద్యార్థులే ఉన్నారని, అలాంటి విలువైన యువశక్తి భవిష్యత్తును డగ్స్‌ మహమ్మారి నుంచి కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు.


డ్రగ్స్‌ తయారీ, సరఫరాదారుల అంతు చూడాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను చదువుకోవడానికి పంపిస్తుంటే.. ఈ దేశద్రోహులు డ్రగ్స్‌ ద్వారా వారిని కుటుంబాలకు, సమాజానికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 2047 నాటికి మనదేశాన్ని ‘వికసిత్‌ భారత్‌’గా తీర్చిదిద్దాలంటే ముందుగా మన యువతను కాపాడుకోవాలని తెలిపారు. ప్రతి పాఠశాల, కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఏకమై విద్యార్థుల భవిష్యత్తును, దేశాన్ని రక్షించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటానికి సినీ నటుడు వెంకటేష్‌ మద్దతివ్వటం శుభ పరిణామమని అన్నారు. ఈ ఉద్యమం ద్వారా డ్రగ్స్‌ మాఫియా గుండెల్లో వణుకు పుట్టిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడ, ఎవరు మాదకద్రవ్యాలను తయారు చేసినా, విక్రయించినా వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు.


డ్రగ్స్‌ మహమ్మారిని అంతం చేయడానికి కృషి చేస్తామని యాత్రలో పాల్గొన్నవారితో కిషన్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. రాజకీయాలకు అతీతంగా సమాజహితం కోసం సాగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తమ నైపుణ్యాలతో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. మన దేశానికి అసలైన సంపద అయిన యువశక్తిని దెబ్బతీసి, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శత్రు దేశాలు మాదకద్రవ్యాలను ఆయుధంగా ఎంచుకున్నాయని ఆరోపించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. యువత భవిష్యత్తును కాపాడుకోవాలంటే మాదకద్రవ్యాల నిర్మూలన అత్యవసరమని హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రభుత్వ చర్యలతోపాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. నార్కో టెర్రరిజం దేశానికి ముప్పుగా మారుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.


డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్‌ చెప్పండి: వెంకటేశ్‌

భారతదేశానికి యువతే అతిపెద్ద బలమని సినీ నటుడు వెంకటేష్‌ అన్నారు. యువతకు ప్రభుత్వం విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని.. వాటిని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. యువతను డ్రగ్స్‌ వ్యసనాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ‘డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్‌’ చెప్పండి అని పిలుపునిచ్చారు. తనకు కూడా కొందరు డ్రగ్స్‌ను అలవాటు చేసేందుకు ప్రయత్నించారని.. కానీ, తాను వాటిని ఎప్పుడూ దరిచేరనీయలేదని మరో సినీనటుడు నిఖిల్‌ సిద్ధార్థ తెలిపారు.


ఉస్మానియా వర్సిటీలో జరిగిన యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ‘మనచుట్టూ ఉండే కొంతమంది మనల్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తారు. పార్టీలు, ఫంక్షన్లలో ఇది చేస్తావా? అది తీసుకుంటావా? అని అలవాటు చేసే ప్రయత్నం చేస్తారు. విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు కూడా అలాంటి అనుభవం ఎదురైంది. అప్పుడు నేను నో చెప్పకపోయి ఉంటే.. ఇప్పుడు 21 సినిమాల్లో నటించి ఉండేవాన్ని కాదు’ అని పేర్కొన్నారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని సినీ నటి పాయల్‌ రాజ్‌పుత్‌ పిలుపునిచ్చారు. బుధవారం అంబర్‌పేట్‌ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యాత్రను కిషన్‌రెడ్డి మొదలుపెట్టారు. ముషీరాబాద్‌ వరకు 13 కిలోమీటర్ల దూరం తొలిరోజు యాత్ర నిర్వహించారు. గురువారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, అశోక్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, లిబర్టీ, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌ ప్రాంతాల్లో యాత్ర నిర్వహించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 04:20 AM