యూఎస్ పర్యటనపై సీఎం రేవంత్ క్లారిటీ ఇవ్వాలి: కిషన్ రెడ్డి
ABN , Publish Date - Aug 25 , 2026 | 05:49 PM
అమెరికా పర్యటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతోనే తన యూఎస్ పర్యటనను కేంద్రం అడ్డుకుందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 25: అమెరికా పర్యటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతోనే తన యూఎస్ పర్యటనను కేంద్రం అడ్డుకుందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో ఆయన స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం అని కొట్టిపారేశారు. అనుమతులు లేకుండా ఎందుకు విదేశీ పర్యటనకు వెళ్లారంటూ తెలంగాణ సీఎంను ఆయన సూటిగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి.. స్థాయికి తగినట్లుగా ఈ పర్యటన లేదని తెలిపారు.
ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనపై తాము కొత్తగా నిబంధనలు పెట్టలేదని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం నుంచి ఉన్న నిబంధనలే తాము అమలు చేశామని స్పష్టం చేశారు. ఇది సాధారణ ప్రక్రియ.. ఇందులో రాజకీయాలకు తావు లేదన్నారు. భారత్‌పై విషం చిమ్మే వ్యక్తి న్యూయార్క్ మేయర్ మామ్దానీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారంటూ వార్తలు వచ్చాయని వివరించారు. ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అని న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యనించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మామ్ధానీను ఎందుకు కలుస్తున్నారో.. సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో తన విదేశీ పర్యటనను కూడా కేంద్ర విదేశాంగ శాఖ నిరాకరించిందని కిషన్ రెడ్డి తెలిపారు. మన దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. గుజరాత్ సీఎంకు యూఎస్ పర్యటనకు అనుమతి ఇచ్చి.. తమకు అనుమతి ఇవ్వలేదని సీఎం రేవంత్ వాదించడం వితండవాదమని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ సీఎంగా ఉన్నప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన విదేశీ పర్యటనను నిరాకరించిందని చెప్పారు.
అయితే సీఎం రేవంత్ రెడ్డికి హార్వర్డ్ బిజినెస్ కోర్సు చదివేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలను కూడా గతంలో రద్దు చేసిందని చెప్పారు. కుల గణన అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని తెలిపారు. హైదరాబాద్‌లో 20 శాతం ఇళ్లలో కులగణన జరగలేదని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కుల గణనపై అవగాహన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా.. వీడియో వైరల్
చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్
For More TG News And Telugu News