దానంపై తీర్పు రాజ్యాంగ విజయం
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:48 AM
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ తీర్పుతో ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సల బండారం బట్టబయలైందని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల ఫిరాయింపు
రాజకీయాల బండారం బట్టబయలైంది
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎంపీ టికెట్
ఎలా ఇచ్చారో రాహుల్ చెప్పాలి: కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ తీర్పుతో ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సల బండారం బట్టబయలైందని పేర్కొన్నారు. తమ రాజకీయ అవసరాల కోసం బరితెగించి చట్టాలను ఉల్లంఘించడం ఇప్పటికైనా మానాలని హితవు పలికారు. ఈ చరిత్రాత్మక తీర్పును 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాడు కేసీఆర్ కాంగ్రెస్ తరఫున గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని కనీసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించకుండానే బీఆర్‌ఎ్‌సలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్ అదే అడుగుజాడల్లో నడుస్తోందన్నారు.
రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ‘సంవిధాన్ బచావో’ అని తిరిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరు బూటకమని విమర్శించారు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం దానం నాగేందర్ ఇంకా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారని తెలిసినా, కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు ఎంపీ టికెట్ ఎలా ఇచ్చిందో రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగం, అవినీతిలో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సల మధ్య ఎలాంటి తేడా లేదన్నారు. అప్పుడు కేటీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి దుకాణాలు తెరిచి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కూలేశ్వరమైందని, కేసీఆర్ లక్ష కోట్లు గోదావరిలో పోశారంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేని ప్రశ్నించారు. ‘నువ్వు పీనుగులు తింటే నేను ఏనుగులు తింటా, నువ్వు ఒక కన్ను పీకితే నేను రెండు కళ్లు పీకుతాను, నువ్వు షర్ట్ విప్పితే నేను ప్యాంటు విప్పుతానన్నట్లు ఆ రెండు పార్టీల వ్యవహార శైలి ఉంద’న్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరో రెండ్రోజులు వర్షాలు
అటవీ భూములకు.. మీరెలా పట్టాలిస్తారు?
Read Latest AP News And Telangana News And International News And Telugu News