అటవీ భూములకు.. మీరెలా పట్టాలిస్తారు?
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:43 AM
అటవీ భూములపై కలెక్టర్ సహా రెవెన్యూ అధికారులెవరికీ అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అటవీ భూములకు పట్టాలు ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు ఎవరని ప్రశ్నించింది.
రెవెన్యూ శాఖకు ఆ అధికారం లేదు: హైకోర్టు
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌పై ఆగ్రహం
అటవీభూముల విషయంలో రెవెన్యూశాఖ
అనవసర జోక్యం అలవాటుగా మారిందని వ్యాఖ్య
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అటవీ భూములపై కలెక్టర్ సహా రెవెన్యూ అధికారులెవరికీ అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అటవీ భూములకు పట్టాలు ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు ఎవరని ప్రశ్నించింది. ఎవరో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఒత్తిడి తెచ్చారని అటవీ భూములకు పట్టాలు ఇవ్వడం సరికాదని తేల్చిచెప్పింది. అడవులను పరిరక్షించాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉంటుందని.. ఆ శాఖను సంప్రదించకుండా రెవెన్యూ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరని స్పష్టం చేసింది. అటవీశాఖ అధికారులు తమను పట్టాభూముల నుంచి ఖాళీ చేయించాలని చూస్తున్నారని, వారిని అడ్డుకోవాలని పేర్కొంటూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం రాజారాం గ్రామానికి చెందిన మౌల్కర్ విట్టల్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దానిపై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అటవీ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చినట్టు గుర్తించింది. ఈ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అటవీ భూముల విషయంలో రెవెన్యూ శాఖ అనవసరంగా జోక్యం చేసుకోవడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానించింది. అటవీ భూములను ఇతర అవసరాలకు మళ్లించడం, ఆక్రమణలకు అవకాశం కల్పించడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పేర్కొంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్‌ను ఆన్‌లైన్ విధానంలో కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. జిల్లా అటవీ అధికారితో కలెక్టర్ సమన్వయం చేసుకుని, చర్చలు జరిపి.. అటవీ భూములకు పట్టాల ఇచ్చిన అంశంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 16కు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
మరో రెండ్రోజులు వర్షాలు
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు సూచించండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News