Share News

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు పేరు సూచించండి

ABN , Publish Date - Sep 20 , 2026 | 05:36 AM

వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయానికి ఏం పేరు పెడితే బాగుంటుందో సూచించాలని ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కాంగ్రెస్‌ ప్రజాపాలనలో ఎయిర్‌పోర్టు కల సాకారం కాబోతుందని శనివారం ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు.

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు పేరు సూచించండి
Warangal airport name

  • ‘ఎక్స్‌’ వేదికగా ప్రజలను కోరిన సీఎం రేవంత్‌

  • ఆయన పిలుపునకు స్పందించిన బండ్ల గణేష్‌, సందీప్‌రెడ్డి వంగా, శ్రీకాంత్‌ ఓదెల

  • రాణి రుద్రమ దేవి, కాకతీయ, సమ్మక్క-సారక్క పేర్లు పెడితే బాగుంటుందని సూచన

హైదరాబాద్‌/ వరంగల్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయానికి ఏం పేరు పెడితే బాగుంటుందో సూచించాలని ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కాంగ్రెస్‌ ప్రజాపాలనలో ఎయిర్‌పోర్టు కల సాకారం కాబోతుందని శనివారం ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. మామునూరు ఎయిర్‌పోర్టు, భూసేకరణ కోసం ఇప్పటికే రూ.295కోట్లను కేటాయించామని పేర్కొన్నారు. విమానాశ్రయానికి అవసరమైన భూమిని సేకరించి, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు స్వాధీనం చేశామని తెలిపారు. ఇది కేవలం ఎయిర్‌పోర్టు మాత్రమే కాదని, పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉపాధి, పెట్టుబడులకు గేట్‌వేగా మారనుందని వివరించారు. తెలంగాణ అభివృద్ధి, రవాణా సదుపాయాల అనుసంధానానికి ప్రతీకగా నిలిచే వరంగల్‌ విమానాశ్రయం నుంచి విమానంలో ప్రయాణించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌... వరంగల్‌ ఎయిర్‌పోర్టు ఏర్పాటు కలను సాకారం చేయడంలో విఫలమైందని ఆరోపించారు.


కుటుంబ ప్రయోజనాలు, విలాసవంతమైన ఫామ్‌హౌ్‌సలపై దృష్టి పెట్టిన ఆ పార్టీ నేతలు.. వరంగల్‌ ప్రజల చిరకాల స్వప్నమైన ఎయిర్‌పోర్టును పట్టించుకోలేదని విమర్శించారు. కాగా, సీఎం రేవంత్‌ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. వరంగల్‌ విమానాశ్రయానికి ‘రుద్రమ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు’ లేదా ‘కాకతీయ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు’గా నామకరణం చేయాలని సినీ దర్శకుడు వంగా సందీ్‌పరెడ్డి ‘ఎక్స్‌’లో సూచించారు. దీనిపై సీఎం రేవంత్‌ స్పందిస్తూ ‘దట్స్‌ ది స్పిరిట్‌!!’ అని వ్యాఖ్యానించారు. దీనికి వంగా సందీ్‌పరెడ్డి స్పందించారు. ‘‘సార్‌... దట్స్‌ ది స్పిరిట్‌.. అనే డైలాగ్‌ను నా స్పిరిట్‌ సినిమాలో రాశాను. మీ నుంచి అదే మాట రావడం చూసి ఆశ్చర్యపోయాను. కొన్ని మాటలు సరైన వ్యక్తి నుంచి వచ్చినప్పుడు వాటి ప్రభావం భిన్నంగా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ విమానాశ్రయానికి ‘రాణి రుద్రమదేవి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు’ అనే పేరు పెట్టాలని సినీ నిర్మాత బండ్ల గణేష్‌, సమ్మక్క-సారక్క ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అనే పేరు బాగుంటుందని సినీ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పేరును ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

మరో రెండ్రోజులు వర్షాలు
తమాషా చేస్తే.. టైర్ల కిందేసి తొక్కిస్తా!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 05:36 AM