Share News

ఓటమి భయంతోనే ఉపఎన్నికలను అడ్డుకుంటున్నారు: బీజేపీ ఎంపీ డీకే అరుణ

ABN , Publish Date - Oct 04 , 2026 | 03:17 PM

ఖైరతాబాద్‌ శాసనసభ ఉపఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందనే భయంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు పిటిషన్లు వేయిస్తోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శించారు.

 ఓటమి భయంతోనే ఉపఎన్నికలను అడ్డుకుంటున్నారు: బీజేపీ ఎంపీ డీకే అరుణ
DK Aruna

హైదరాబాద్‌, అక్టోబర్ 04: ఖైరతాబాద్‌ శాసనసభ ఉపఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందనే భయంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు పిటిషన్లు వేయిస్తోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.


బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఎంపీ డీకే అరుణ తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక సిగ్గులేకుండా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటోందని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో అద్భుత పాలన అందిస్తున్నామని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు.. మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పాలనపై నమ్మకముంటే, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించి ఉపఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలని సవాల్ విసిరారు.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలూ లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తూ రాష్ట్రాన్ని తీవ్రంగా అప్పులపాలు చేశాయని, అభివృద్ధిని కుంటుపరిచాయని డీకే అరుణ ఆరోపించారు. గతంలో ఖైరతాబాద్‌ సీటును బీజేపీ గెలుచుకుందని, రాబోయే రోజుల్లోనూ అక్కడ కమలం జెండానే ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు ప్రజలు తగిన బుద్ధి చెప్పక తప్పదని డీకే అరుణహెచ్చరించారు.


ఇవి కూడా చదవండి:

తక్షణమే కరువు మండలాలు ప్రకటించాలి: కవిత డిమాండ్

ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..

ఫామ్ 7తో ఓట్లు తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర: ఓవైసీ

Updated Date - Oct 04 , 2026 | 03:17 PM