ప్రధాని సభలో బండి సంజయ్.. ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందన్న కవిత
ABN , Publish Date - May 13 , 2026 | 12:14 PM
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. ప్రధాని సభా వేదికను కేంద్ర మంత్రి పంచుకోకుంటే బాగుండేదని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ప్రధాని పర్యటనలో బండి సంజయ్ పాల్గొనడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందని అన్నారు.
హైదరాబాద్, మే 13: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి పొదుపు సూత్రాలు చెప్పారని.. డబ్బులు మాత్రం ఏపీకి ఇచ్చారని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో కవిత మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. ప్రధాని సభా వేదికను బండి సంజయ్ పంచుకోకుంటే బాగుండేదని అన్నారు. ప్రధాని పర్యటనలో కేంద్ర మంత్రి పాల్గొనడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందన్నారు.
బండి సంజయ్ కుమారుడు దేశం దాటి పోకుండా తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కవిత అన్నారు. బండి సంజయ్ కుమారుడు తప్పు చేసినట్లు రుజువు అయితే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆడపిల్ల జీవితం నాశనం అయ్యే విధంగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన వారిని అరెస్ట్ చేయాలని.. సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయాలన్నారు. బాధితురాలి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అత్యుత్సాహం బీఆర్ఎస్ పార్టీకి ఎందుకని ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీ మాట్లాడలేదని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని కలిశారని.. పోలవరం ప్రాజెక్ట్‌ను 5 సార్లు సందర్శించారని తెలిపారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు వెళ్లలేదని విమర్శించారు. ఏపీ నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటోందన్నారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే వాటర్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. చెక్ డ్యామ్‌లు కట్టి నీటి వనరులను సద్వినియోగం చేస్తామని తెలిపారు. ప్రధాని పర్యటనపై బీఆర్ఎస్ ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు.
కులగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించడానికి దేశం మొత్తం తిరుగుతామని చెప్పారు. పోలవరం, బనకచర్లపై రిట్ పిటిషన్ వేయనున్నట్లు కవిత తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి వినతి పత్రం ఇస్తామన్నారు. నీట్ లాంటి జాతీయ పరీక్ష పేపర్ల లీక్ ఘటన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని హెచ్చరించారు. టీఆర్ఎస్ జెండా పండుగలో తాను పాల్గొంటానని తెలిపారు. తెలంగాణ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి తెలంగాణ రక్షణ సేన పుట్టిందని కవిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో బండి భగీరథ్ పరారీ అంటూ పోస్టర్లు
బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. కేటీఆర్ సంచలన పోస్ట్
Read Latest Telangana News And Telugu News