Share News

కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పాం.. వచ్చాం: కవిత

ABN , Publish Date - May 02 , 2026 | 02:06 PM

పాంచజన్యం పేరుతో ఐదు ప్రాధాన్య అంశాలను తీసుకున్నట్లు టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నా, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా ఈ ఐదు అంశాలు ప్రధాన ఫోకస్‌గా ఉంటాయని చెప్పారు.

కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పాం.. వచ్చాం: కవిత
Kalvakuntla Kavitha

హైదరాబాద్, మే 2: తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పాం.. వచ్చామని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని అడ్డంకులను అధిగమించి తెలంగాణ రక్షణ సేన పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 20 ఏళ్లుగా కొనసాగుతున్న తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తుందని, సర్వోదయ తెలంగాణ లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.


పాంచజన్యం పేరుతో ఐదు ప్రాధాన్య అంశాలను తీసుకున్నట్లు కవిత తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నా, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా ప్రధాన ఫోకస్‌గా ఉంటాయని చెప్పారు. ప్రజల ఆదాయంలో 60 శాతం విద్య, వైద్యం కోసమే ఖర్చవుతోందని.. దీని వల్ల సేవింగ్స్ సాధ్యం కావడం లేదని తెలిపారు. ప్రభుత్వం ఉచిత విద్య ఇస్తున్నా 75 శాతం మంది ప్రైవేటు సంస్థల్లో చదువుతున్నారని, వారందరికీ కూడా ఉచిత విద్య అందించేందుకు అన్ని లెక్కలు వేసినట్లు తెలిపారు. వైద్యం విషయంలో క్యాన్సర్ వంటి వ్యాధులతో చికిత్సకు డబ్బుల్లేక చనిపోతున్న పరిస్థితి ఉందని కవిత అన్నారు. తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని లక్షలు ఖర్చైనా ప్రజల వైద్యం కోసం తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం వెనుకడుగు వేయదని హామీ ఇచ్చారు.


రైతన్నలకు ఆత్మగౌరవం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కవిత అన్నారు. ప్రస్తుతం కల్లాల దగ్గరే వడ్లు పడి ఉండటం, కొనుగోలు కేంద్రాలు తెరవాలని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉందని విమర్శించారు. రైస్ ఎగుమతి చేసే అవకాశాలున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఓ రైతు మక్కల కొనుగోలు కేంద్రంలోనే మరణించిన సంఘటనను ప్రస్తావించిన కవిత.. రైతు ప్రాణానికి విలువ లేకపోవడం బాధాకరమన్నారు. రైతన్నలకు మేలు చేసే విషయంలో తాము చాలా సీరియస్‌గా పనిచేస్తున్నామన్నారు.


రాష్ట్రంలో ఉపాధి అంటే ఒక జోక్‌గా మారిందని.. యువత అవసరాలను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని కవిత విమర్శించారు. 18-25 ఏళ్ల జెన్‌ జీ యువతను నమ్ముతున్నట్లు చెప్పారు. మంచి ఆలోచనలతో వచ్చే 25-45 ఏళ్ల వారికి రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. యువత ఉద్యోగాలు వెతకకుండా ఉద్యోగాలు ఇచ్చేలా తయారవ్వాలని.. గూగుల్, వాట్సాప్ లాంటి సంస్థలు తెలంగాణ నుంచి రావాలని ఆకాంక్షించారు.


సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. 65 ఏళ్లు దాటి రిటైర్డ్ అయిన ఐఏఎస్, ఐపీఎస్‌లకు కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అగ్రవర్ణాల్లోని పేదలు, దివ్యాంగులు, మాజీ మావోయిస్టులు, మాజీ సైనికులు, అందరికీ ఇళ్లు కట్టించడం సామాజిక న్యాయమేనని కవిత వివరించారు. అమ్మలా పాలన చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, తమ పాలన అలాంటిదే అని కవిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

కోడెల శివప్రసాదరావు జయంతి.. సీఎం, లోకేశ్ నివాళులు

సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. వందల్లో ఫేక్‌ ప్రొఫైల్స్ తొలగింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 02 , 2026 | 02:51 PM