Share News

మాట తప్పడం, మడమ తిప్పడమే సీఎం రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్: కవిత

ABN , Publish Date - Sep 15 , 2026 | 03:10 PM

ప్రభుత్వ ఉద్యోగులంటే మీ బానిసలు కాదని గుర్తు పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సెప్టెంబర్18వ తేదీలోగా వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఎం రేవంత్‌ రెడ్డికి ఆమె అల్టిమేటం ఇచ్చారు.

మాట తప్పడం, మడమ తిప్పడమే సీఎం రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్: కవిత
TRS Chief Kavitha

హైదరాబాద్, సెప్టెంబర్15: ప్రభుత్వ ఉద్యోగులంటే మీ బానిసలు కాదని గుర్తు పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సెప్టెంబర్18వ తేదీలోగా వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఎం రేవంత్‌ రెడ్డికి ఆమె అల్టిమేటం ఇచ్చారు. సీఎం స్పందించకుంటే హైదరాబాద్ దిగ్బంధానికి సిద్ధం కావాలని ఉద్యోగ సంఘాలకు ఆమె పిలుపునిచ్చారు. మీ పోరాటానికి టీఆర్ఎస్ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సదస్సులో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. మాట తప్పడం, మడమ తిప్పడమే సీఎం రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్ అని ఎద్దేవా చేశారు. తమ సమస్యలు తీర్చాలని అడిగితే ఉద్యోగులు, ఉపాధ్యాయులను బెదిరిస్తున్నరంటూ సీఎం రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు.


తెలంగాణ ఉద్యమం సమయంలో ఉపాధ్యాయులంతా కూడా ఉద్యోగం కన్నా ఉద్యమమే ముఖ్యమని పోరాటం చేశారని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి సర్కా‌ర్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వమైన ప్రజలకు మెరుగైన పారదర్శకమైన పాలన అందించాలంటే ఉద్యోగుల సహకారం అవసరమని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ వారిని నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ ఒక్క పథకం కూడా సరిగా అమలు కావటం లేదని తెలిపారు.


ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తుండటం కారణంగానే పరిపాలన సజావుగా సాగటం లేదని టీఆర్ఎస్ చీఫ్ వివరించారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను అభివృద్ధిలో డెవలపర్స్‌గా చూస్తామని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులను సంతోష పెట్టేలా, వారిని గౌరవించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణ జాగృతి గత 20 ఏళ్లుగా ఏ కార్యక్రమం చేసిన సరే దాన్ని ముందుండి నడిపిందే ప్రభుత్వ ఉపాధ్యాయులేనని తాను గర్వంగా చెబుతానని పేర్కొన్నారు. 2023 ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్ని చేస్తామని మాటిచ్చారని గుర్తు చేశారు.


కానీ ఇప్పుడు వారిని పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ ఉద్యోగి సంతోషంగా లేరన్నారు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా మాత్రమే పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. మరో 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని వివరించారు. రిటైర్ అయిన ఉద్యోగులు 2 లక్షల వరకు ఉన్నారని గణాంకాలతో సహా కల్వకుంట్ల కవిత తెలిపారు. వారందరికీ భరోసా ఇచ్చేందుకే ఈ మీటింగ్ పెట్టుకున్నామని ఆమె చెప్పారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా విద్య, వైద్యం అందాలనే ఉన్నత లక్ష్యాన్ని టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని కవిత స్పష్టం చేశారు. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.


మన రాష్ట్రంలో దాదాపు 6 వందల మండలాలుంటే 8 మంది మాత్రమే పర్మినెంట్ ఎంఈఓలు ఉన్నారని గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వ విద్యపై మానిటరింగ్ అనేదే లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. హెడ్ మాస్టర్లను, సీనియార్ టీచర్లనే ఎంఈఓలుగా పెడుతున్నారంటూ రేవంత్ ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా ఎండగట్టారు. విద్యార్థులకు పేషీయల్ రికగ్నేషన్ అంటూ రిపోర్ట్‌లు అంటూ టీచర్లు పాఠాలు చెప్పకుండా చేస్తున్నారని చెప్పారు. ఇక ఒకే టీచర్ ఉన్న స్కూళ్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. టీచర్లకు సీనియారిటీని బట్టి ఇవ్వాల్సిన ప్రమోషన్లు కూడా ఇవ్వటం లేదన్నారు.


గురుకులాలు, డిగ్రీ కాలేజ్‌లలో 40 శాతం ఖాళీలు ఉన్నాయని వివరించారు. ఖాళీలను భర్తీ చేయటం లేదని.. ఉన్న టీచర్లను ఈ ప్రభుత్వం సరిగా చూసుకోవటం లేదని పెదవి విరిచారు. ప్రధాని మోదీ కారణంగా పప్పు, ఉప్పు, చక్కెర ధరలు భారీగా పెరిగాయని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు డీఏ ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వానికి సూచించారు. కానీ గత 32 నెలలుగా డీఏ ఇవ్వకుండా వారి కరువు భత్యాన్ని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మింగేశారని కవిత ఎద్దేవా చేశారు. ఇవే సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఇష్టమొచ్చినట్లు తిట్టారని గుర్తు చేశారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయటం లేదని అన్నారు.


రాష్ట్రంలో లక్షా 20 వేల మంది టీచర్లే ఉంటారు. కానీ వాళ్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాలేదని తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్లీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ప్రతి ఊళ్లో ఓ స్కూల్ ఉండాలని.. ప్రతి తరగతికి ఓ టీచర్ ఉండాలని టీఆర్ఎస్ ఒక విధానం పెట్టుకుందని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యను పరిపుష్టం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యను కాపాడుతామని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భరోసా ఇచ్చారు.

ఈ రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. వాళ్లకు రావాల్సిన అన్ని ప్రయోజనాలు పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. 2003లో రిక్రూట్ అయిన పోలీసులకు ఓపీఎస్ రాలేదని గుర్తు చేశారు. అదే విధంగా 2003లో రిక్రూట్ అయినా టీచర్లకు కూడా ఓపీఎస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. 2003లో రిక్రూట్ అయిన టీచర్లకు ఓపీఎస్ ఇస్తే ప్రభుత్వానికే రూ. 2 వేల కోట్లు మిగులుతాయని తెలిపారు. కనీసం ఈ విషయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియటం లేదని ఎద్దేవా చేశారు. వారిని ఓపీఎస్‌కు బదలాయించడం ద్వారా వచ్చే రూ.2 వేల కోట్లతో మిగతా బకాయిలు తీర్చాల్సి ఉందని ప్రభుత్వానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సూచించారు.


ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు మాటిమాటికి ఆందోళనలను వాయిదా వేసుకుంటున్నారని చెప్పారు. మనం తల్లి కాంగ్రెస్‌తో పోరాటం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న వాళ్లమని.. ఈ పిల్ల కాంగ్రె‌స్‌కు భయపడాల్సిన అవసరం లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సూచించారు. మనం ఏపీని చూసి ఉద్యమాలు నేర్చుకోలేదన్నారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీచర్లు పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ల డిమాండ్లు సాధించుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

మనం కూడా అదే విధంగా పోరాటం చేసి డీఏలు సాధించుకోవాలని వారికి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో భయపడుతుండటంతో కిందిస్థాయి ఉద్యోగులకు మీపై నమ్మకం ఉండటం లేదంటూ ఉద్యోగ సంఘం నేతలకు కవిత చురకలంటించారు. దాదాపు 206 ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు జేఏసీ పోరాటం చేస్తున్నాయని వివరించారు. అందుకే తాము వారికి మద్దతుగా సంయమనంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.


సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే మీరు అన్యాయం కావాల్సిందేనని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కవిత హితవు పలికారు. ఉద్యోగుల పీఆర్సీ ఎక్స్‌పైర్ అయ్యే పరిస్థితి ఉందని ఆందోళన చెందారు. తక్షణమే వారికి 51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్ కార్డు ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్‌లో పని చేస్తుందా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా కవిత ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ప్రభుత్వ హైల్త్ కార్డు పనిచేస్తే మీరు ఏం చేయమంటే అది టీఆర్ఎస్ చేస్తుందన్నారు. లేదంటే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు.

ఉద్యోగులు తమ బెన్‌ఫిట్స్ అడిగితే రెండేళ్లు ఆగాలంటూ ముఖ్యమంత్రి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా రెండేళ్లు ఆగితే మీరు పదవిలో ఉండరన్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ ఏమీ చేయరని అనుకుంటున్నారేమో.. వారికిచ్చే బెన్‌ఫిట్స్ ఆలస్యం చేస్తే 6 నుంచి 12 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని రేవంత్ ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటి వరకు ఉద్యోగులు ఇబ్బందులకు గురి కావద్దని చూస్తున్నామని తెలిపారు. వారు చేసే ఏ ఆందోళనకైనా తాము నైతికంగా మద్దతిస్తామన్నారు. ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న 37 అంశాల్లో చాలా వరకు డబ్బులకు సంబంధం లేనివే ఉన్నాయని గుర్తు చేశారు.


ముఖ్యంగా 317 జీవో బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో వారికి న్యాయం చేసేందుకు తాను చేసిన ప్రయత్నం ఫలించలేదని ఆవేదన చెందారు. 317 బాధితుల్లో మహిళ ఉద్యోగులే అధికంగా ఉన్నారని చెప్పారు. వాళ్లు బాధపడుతుంటే తనకు బాధవుతుందన్నారు. ఆగస్టు 18 వరకు సమస్యలు పరిష్కరిస్తానని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత సమస్యలు పరిష్కరం కాకపోతే హైదరాబాద్ దిగ్భంధం కోసం ఉద్యోగ సంఘాలు పిలుపు ఇవ్వాలని సూచించారు.

మీ భుజం తట్టి మీ కోసం తాము పోరాటం చేస్తామని మీకు హామీ ఇస్తున్నా కవిత స్పష్టం చేశారు. అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ సమస్యలు కూడా తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీతాలు రాకపోయినా సరే ప్రజలు ఇబ్బంది పడవద్దని వారంతా ఇంకా పనిచేస్తున్నారని తెలిపారు. వెంటనే వారికి బకాయి పడ్డ జీతాలు చెల్లించి వారి సమస్యలు తీర్చాలని ప్రభుత్వానికి కవిత సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్‌ కేసు.. సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి షాక్

అసైన్డ్ భూములపై రేవంత్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్ రావు

For More TG News And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 03:36 PM