‘పార్టీ వైఫల్యాన్ని కేసీఆర్‌పై మోపుతున్నావ్.. నాతో పెట్టుకోకు’.. కేటీఆర్‌పై కవిత ఫైర్
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:31 PM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు(టీఆర్‌ఎస్) కవిత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీరుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. తాను బీఆర్‌ఎస్ పార్టీలోని ఓ వ్యక్తిని విమర్శించినందుకే తనను కొన్ని గంటల్లోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. ఇప్పుడు తాను విమర్శించిన వ్యక్తితో అంటకాగుతూ.. పార్టీ అధినేత తీరుతోనే నష్టపోయామని బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేకం కాదా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.
‘మీరు మీ పార్టీ అధినేత కేటీఆర్‌ను విమర్శించడం.. ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను బాహాటంగా తప్పుపట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా? మీ ఫాంహౌస్‌లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు.. ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు.. క్విడ్ ప్రోకో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా?’ అని కవిత నిలదీశారు. నిన్నటి బీఆర్ఎస్ మీటింగ్‌లో ఓ రైతు ఫోన్ మాట్లాడుతుంటే ‘నీ పెండ్లామా!? అంత అర్జెంటా!? అని అహంకారంతో అతని భార్యనే అవమానించారని మండిపడ్డారు. అలాగే ఓ మహిళా సాయం కోరి వస్తే ‘నా కోసం కన్నావా’ అని అమ్మనే అవమానించారని ఆరోపించారు. ‘గుంటనక్క MIND GAME లో BLIND గా పడిపోయి పెద్ద మనిషినే తప్పు బడుతున్నావ్.. బీఆర్ఎస్‌కు గోతిని తవ్వుతున్నావ్’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు.. పార్టీలో మీ వైఫల్యాన్ని.. మీ చేతగానితనాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపుతున్నావు అంటే... ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో అర్థమవుతుందా? నిమజ్జనోత్సవంలో ఎంతమంది సోషల్ మీడియా influencers ను బతిమాలుకున్నారో ఆ గణేశ్ మహారాజుకు, మీ అంతరాత్మకు తెలుసు. నేను నీలాగా విష నాగుల మాటలు విని మాట్లాడను.. నిర్దిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతాను.. నాతో పెట్టుకోకు!’ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ఎక్స్‌లో కవిత పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పనులకు ఆర్మీ ఇంజినీరింగ్ అధికారుల సేవలు
‘ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నారు’.. కాంగ్రెస్‌పై ఎంపీ ఈటల ఆగ్రహం
Read Latest Telangana News And Telugu News