Share News

డబుల్ ఇంజిన్ సర్కార్ జెట్ స్పీడ్‌తో ముందుకెళ్తోంది: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 29 , 2026 | 04:13 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అద్భుతమైన మార్పునకు నాంది పలుకుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కూటమికి ప్రజలు వేసిన ఓటు వృథా కాలేదన్నారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ జెట్ స్పీడ్‌తో ముందుకెళ్తోంది: సీఎం చంద్రబాబు
Palle Panduga 3.0

నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో రూ.11,085 కోట్లతో గ్రామీణాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ నిధుల్లో కేంద్ర వాటా రూ.5,391 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.5,694 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ సందర్భంగా రామాపురానికి నెల్లూరు, ప్రకాశం, కడప, నంద్యాల జిల్లాల నుంచి లక్షలాది మంది కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కాగా, ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, ఫరూఖ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.


పల్లె పండుగ 3.0 ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 'పల్లె పండుగ 3.0ని రూ.11,085 కోట్లతో ప్రారంభించాం. గ్రామాల్లో అద్భుతమైన మార్పునకు నాంది పలుకుతున్నాం. ఏపీని పునర్నిర్మాణం చేస్తామని 2024లో చెప్పాం. మీరు వేసిన ఓటు వృథా కాలేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ జెట్ స్పీడ్‌తో ముందుకెళ్తోంది. 2024 కంటే ఇంకా ఎక్కువ హవా ఇప్పుడు కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని మా ఆడబిడ్డలు సంకేతాలిస్తున్నారు. గ్రామాలను అభివృద్ధి చేస్తున్న పవన్‌కు అభినందనలు. పంచాయతీరాజ్ శాఖలో పవన్ మార్క్ చూపించారు. కేంద్ర పథకాలను ఫాలోఅప్ చేసుకుంటూ పల్లెల్లో పనులు చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో పల్లెలు కన్నీరు పెట్టుకున్నాయి. ఆ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులూ రాకుండా చేసింది' అని పేర్కొన్నారు.


పేదలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఆర్థిక అసమానతలు తొలగించడమే మా ధ్యేయం. ఎన్నికలకి ముందు పరిస్థితులు ఎవరూ మరిచిపోకూడదు. రూ.10 లక్షల కోట్లు అప్పు వారసత్వంగా ఇచ్చి వెళ్లారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నాకే మతి పోయింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చింది. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ చేశాం. గతేడాది లక్ష మంది ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలని చేశాం. ఈ ఏడాది ఐదు లక్షల మందిని పారిశ్రామికవేత్తలని చేస్తాం. గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలను, పెట్టుబడులను తరిమేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. వెలిగొండ ప్రాజెక్టుకి నేనే శంకుస్థాపన చేశాను.. నేనే ప్రారంభించాను. వెలిగొండ ఫేస్-2 కూడా పూర్తి చేస్తాం. నెల్లూరు, మార్కాపురం ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం. ఉదయగిరి నియోజకవర్గం పండ్ల తోటల హబ్‌గా తయారవుతుంది' అని చంద్రబాబు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

పల్లె పండుగ 3.0ని ఘనంగా ప్రారంభించిన కూటమి అగ్రనేతలు..

రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0.. ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ హర్షం..

Updated Date - Sep 29 , 2026 | 04:24 PM