Share News

కాళేశ్వరం మరమ్మతులు త్వరగా చేపట్టండి

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:21 AM

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను నిర్ణీత వ్యవధిలోగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరం మరమ్మతులు త్వరగా చేపట్టండి
Revanth Reddy

  • బ్యారేజీల ఎగువ, దిగువ భాగాల్లో డయాఫ్రం వాల్‌లు నిర్మించాలి

  • ఏదుల రిజర్వాయర్‌ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి జలాలు

  • నీటిపారుదల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను నిర్ణీత వ్యవధిలోగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి నీటిపారుదలశాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం బ్యారేజీల పునాదుల కింద భారీగా ఇసుక మైనింగ్‌ జరిగిందని, నిర్మాణ సమయంలో డిజైన్‌కు విరుద్ధంగా సీకెంట్‌ పైల్స్‌ను వినియోగించారని, వీటి అమరిక సరిగ్గా లేనందువల్ల బ్యారేజీల పునాదులు దెబ్బతిన్నాయని అధికారులు సీఎంకు నివేదించారు. మూడు బ్యారేజీలను పునరుద్ధరించి, మళ్లీ వినియోగంలోకి తేవాలంటే విధిగా బ్యారేజీల ఎగువ (అప్‌స్ట్రీమ్‌), దిగువ (డౌన్‌ స్ట్రీమ్‌)లలో డయాఫ్రం వాల్‌ కట్టాల్సి ఉంటుందని తెలిపారు.


దాంతో పాటు బ్యారేజీల గేట్ల నుంచి విడుదలయ్యే వరద ప్రవాహ ఉధృత్తిని తట్టుకోవడానికి వీలుగా నీళ్లు పడే ప్రదేశం (స్టిల్లింగ్‌ బేసిన్‌)ను కూడా విస్తరించాల్సి ఉంటుందని వివరించారు. 2019లో బ్యారేజీల నిర్మాణం పూర్తి కాగా... ఆ తర్వాత ఏటా వరదలకు గేట్లు ఎత్తినప్పుడు డౌన్‌స్ట్రీమ్‌లోని రక్షణ వ్యవస్థలన్నీ దెబ్బతింటున్నాయని, టెయిల్‌పాండ్‌ ఉంటే బ్యారేజీల గేట్ల నుంచి వరదలోని శక్తిని నిర్వీర్యం చేసే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. అధికారుల వివరణ విన్న సీఎం.. బ్యారేజీల మరమ్మతుల డిజైన్‌లకు తుదిరూపు ఇచ్చి... కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)లోని ఓవర్‌ సైట్‌ కమిటీ మధింపు అనంతరం పనులు ప్రారంభించాలని ఆదేశించారు. బ్యారేజీల ఎగువ, దిగువ భాగంలో డయాఫ్రం వాల్‌లు నిర్మించాలని, స్టిల్లింగ్‌ బేసిన్‌ను కూడా పెంచాలని సూచించారు.


తుమ్మిడిహెట్టి బ్యారేజీ ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎ్‌ఫఆర్‌)పై కూడా సమావేశంలో చర్చ జరిగింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీలపై సీడబ్ల్యూసీ అధికారులతో సమావేశం అనంతరం.. వారు కోరిన కీలక వివరాలన్నీ సీడబ్ల్యూసీకి, మహారాష్ట్ర అధికారులకు పంపించినట్లు అధికారులు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఏదుల రిజర్వాయర్‌ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ పథకం డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించినప్పుడే ఈ విషయాన్ని పొందుపరచడం జరిగిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకం పరిధిలో అవసరాలు తీర్చుతూనే డిండికినీటిని తరలించాలని ఆదేశించారు. డిండిలో కెనాల్‌, ఇతర కాంపోనెంట్లు కొలిక్కి వచ్చినప్పటికీ హెడ్‌ రెగ్యులేటరీ విషయంలో సందిగ్ధత ఉందని అధికారులు చెప్పగా.. ఏదుల నుంచే డిండికి నీటిని తరలించాలని సీఎం స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...
మార్వాడీ వ్యాపారి దారుణ హత్య!

ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ‘ఫ్రీ ఎగ్జిట్‌’ అవకాశం
17 ఏళ్ల ట్రైనీ నర్స్‌పై హాస్పిటల్‌ ఎండీ లైంగిక దాడి
Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 05:21 AM