ఎంబీబీఎస్ విద్యార్థులకు ‘ఫ్రీ ఎగ్జిట్’ అవకాశం
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:15 AM
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సులో చేరిన విద్యార్థులకు యూనివర్సిటీ కీలక అవకాశం కల్పించింది.
కన్వీనర్ కోటా సీటును వదులుకునే వెసులుబాటు
8న మధ్యాహ్నం 2 గంటల వరకే గడువు.. దాటితే జరిమానా
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సులో చేరిన విద్యార్థులకు యూనివర్సిటీ కీలక అవకాశం కల్పించింది. 2026-27 విద్యాసంవత్సరానికి కాంపిటెంట్ అథారిటీ (కన్వీనర్) కోటా కింద రెండో విడత కౌన్సెలింగ్ వరకు ప్రవేశాలు పొందిన అభ్యర్థులు సీట్లను వదులుకునేందుకు వారికి ‘ఫ్రీ ఎగ్జిట్’ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ర్టార్ సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
అభ్యర్థులు జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటల వరకు కోర్సు నుంచి తప్పుకోవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు కాలేజీ ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు సమర్పించాలి. నిర్ణీత గడువు తర్వాత సీటు రద్దు చేసుకుంటే పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పేర్కొంది. ఫ్రీ ఎగ్జిట్ పొందే విద్యార్థులు ప్రస్తుత విద్యాసంవత్సరంలో కన్వీనర్ కోటా కింద నిర్వహించే తదుపరి విడతల కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులవుతారని తెలిపింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగానే వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు వారు చెల్లించిన పూర్తి ఫీజును తిరిగి ఇచ్చేయాలని ప్రిన్సిపాళ్లకు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి...
మార్వాడీ వ్యాపారి దారుణ హత్య!
క్యారెట్‌లేన్ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ
17 ఏళ్ల ట్రైనీ నర్స్‌పై హాస్పిటల్ ఎండీ లైంగిక దాడి
Read Latest Telangana News And Telugu News