జయేశ్ వీఆర్‌ఎస్!
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:23 AM
పట్టణాభివృద్ధి, క్రీడా శాఖలకు అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్)కు దరఖాస్తు చేయనున్నారా!? వచ్చే ఏడాది సెప్టెంబరులో ఉద్యోగ విరమణ చేయాల్సిన ఆయన
స్వచ్ఛందంగా తప్పుకోవాలని నిర్ణయించిన సీనియర్ ఐఏఎస్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి రాకపోవడంతో అసంతృప్తి
సీఎంవోలోని ఓ సలహాదారుతో విభేదాలూ కారణమని చర్చ
ఫార్చ్యూన్ 100 కంపెనీల ఆఫర్లు వచ్చాయన్న సన్నిహితులు
వీఆర్‌ఎస్ తర్వాత గూగుల్‌లో చేరతారంటూ ప్రచారం
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి/క్రీడా ప్రతినిధి): పట్టణాభివృద్ధి, క్రీడా శాఖలకు అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్)కు దరఖాస్తు చేయనున్నారా!? వచ్చే ఏడాది సెప్టెంబరులో ఉద్యోగ విరమణ చేయాల్సిన ఆయన.. ఇంకా 11 నెలల కాలం ఉండగానే ప్రభుత్వ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పడానికి సిద్ధమయ్యారా!? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం రాకపోవడం, సీఎంవోలో ఉన్న ఓ సలహాదారుతో విభేదాలే ఇందుకు కారణమా!? ఇందుకు ‘ఔను’ అనే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. ఫార్చ్యూన్-100 కంపెనీల నుంచి ఆయనకు ఆహ్వానాలు వచ్చాయని, అందువల్లే ఆ దిశగా ఆలోచిస్తున్నారని చెబుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే అప్పగించిన పనులను పూర్తి చేసి, వీఆర్‌ఎ్‌సకు అనుమతి లభించిన వెంటనే రాష్ట్రాన్ని వీడేందుకు ఆయన సిద్ధమవుతున్నారని వివరించాయు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా తనను నియమించకపోవడంపై జయేశ్ రంజన్ అసంతృప్తిగా ఉన్న విషయం బహిరంగ రహస్యమే. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే జయేశ్‌కు గత 12 ఏళ్లలో రాష్ట్రంలో ఏర్పాటైన రెండు ప్రభుత్వాల్లోనూ తనదైన ముద్ర వేసిన అధికారిగా పేరుంది. కొన్ని కీలక కంపెనీలు, ప్రాజెక్టులను తెలంగాణకు తీసుకు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెబుతారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన ఆయన 1992లో యూపీఎస్సీ పరీక్షలు రాసిన తొలిసారే ఆలిండియా మొదటి ర్యాంకు సాధించారు. ప్రపంచ బ్యాంకుతోపాటు అనేక అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పని చేశారు.
గత 12 సంవత్సరాల్లో అనేక అంతర్జాతీయ సదస్సులకు నేతృత్వం వహించారు. ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న విశేష అనుభవం ఉంది. యూకే, యూఎస్, స్వీడన్, కొరియా, జపాన్ దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సన్నిహిత సంబంధాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు గత జూన్ నెలాఖరులో ఉద్యోగ విరమణ అనంతరం తదుపరి సీఎస్‌గా జయేశ్ రంజన్ పోటీలో నిలిచారు. ఢిల్లీలో కేంద్ర సర్వీసులో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన బ్యాచ్‌కే చెందిన సంజయ్ జాజును సీఎ్‌సగా నియమించినప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యం లభించడం లేదని భావిస్తున్నారు.
ఓ సలహాదారుతో విభేదాలు
రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవలే సలహాదారుగా నియమితులైన ఒకరితో తలెత్తిన విభేదాలు కూడా జయేశ్ రంజన్ నిర్ణయానికి కారణమన్న చర్చ నడుస్తోంది. హైదరాబాద్ వేదికగా ఇటీవలే జయేశ్ ఏర్పాటు చేయాలని భావించిన ఓ క్రీడా శాఖ కార్యక్రమంపై సీఎంవో నుంచి సదరు సలహాదారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆగిపోయిందని తెలిసింది. ఇలాంటి మరిన్ని అంశాలపై కూడా వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. ఒలింపిక్స్ తర్వాత అంతటి ప్రతిష్ఠాత్మకమైన ఆసియా క్రీడల్లో తెలంగాణకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచి పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఇప్పటి వరకూ వారికి ఎటువంటి ప్రోత్సాహం అందలేదు. ఈ నేపథ్యంలోనే, హైదరాబాద్ వేదికగా ఇటీవల ముగిసిన ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) అనే ప్రైవేట్ క్రీడా పోటీల ముగింపు వేడుక సందర్భంగా సీఎంను ఆహ్వానించి, అక్కడ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు సత్కారాలు చేసి, నగదు ప్రోత్సాహక చెక్కులు అందించాలని క్రీడా శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యత లు నిర్వర్తిస్తున్న జయేశ్ రంజన్ ప్రణాళిక రచించారు. అయితే, అధికారిక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రైవేట్ లీగ్ వేదిక వద్ద ఎలా చేస్తామని సీఎంవోలోని సదరు సలహాదారు నుంచి సంకేతాలు రావడంతో అక్కడ జరగాల్సిన కార్యక్రమం రద్దయింది. అంతకు ముందు కూడా క్రీడాకారులందరినీ ఒకేసారి సీఎం దగ్గరకు తీసుకెళ్లాలన్న ప్రతిపాదనతో ఒక క్రికెటర్ కోసం ఈనెల 14వ తేదీ వరకు వేచి చూశారు.
ఆ తర్వాత 18న జరిగిన ఏపీఎల్ ముగింపు వేడుకలో క్రీడాకారులకు సన్మానం ఏర్పాటు చేయాలని విఫలయత్నం చేశారు. చివరికి, సీఎంవోకు తెలపకుండా నేరుగా క్రీడాకారుల ఖాతాల్లోకి ప్రోత్సాహక నగదును బదిలీ చేయాలని జయేశ్ రంజన్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. దీనికితోడు, మౌలిక సదుపాయాల కల్పనపై కాకుండా 2-3 రోజులు నిర్వహించే ప్రచార కార్యక్రమాలపై ఎందుకు కోట్లలో ఖర్చు చేస్తున్నారని ఇటీవల ఒక సమీక్షలో సీఎంవోలోని సదరు సలహాదారు, ప్రభుత్వంలోని మరో పెద్ద నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే, ఇక నుంచి జరిగే క్రీడా కార్యక్రమాలను గ్లోబల్ టెండర్ల ద్వారా నిర్వహించాలని సదరు సలహాదారు చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో, సదరు సలహాదారుతో జయేశ్ రంజన్‌కు విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి.
సీఈవోగా చేరండి.. కంపెనీల ఆఫర్లు
సీఎ్‌సగా అవకాశం రాకపోవడంతో గత నాలుగు నెలలుగా అసంతృప్తితో ఉన్న జయేశ్ రంజన్‌కు పలు దేశాల కంపెనీలు ఉన్నత స్థానాలను ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దేశంలో తొలి ‘ఐకియా’ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం వెనక కీలక పాత్ర పోషించినందుకు స్వీడన్ ప్రభుత్వం 2019లో జయేశ్‌ను ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సన్మానించింది. దీంతో, స్వీడన్‌కు చెందిన పలు దిగ్గజ ఐటీ కంపెనీలు సీఈవోగా చేరాలని ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది.
అలాగే, యూకే-తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచినందుకు యూకేలోని యునివర్సిటీ ఆఫ్ బోల్టన్ 2022లో గౌరవ డాక్టరేట్ అందించి సత్కరించింది. ఇలా భారత్ నుంచి ఇలాంటి పురస్కారం పొందిన తొలి ఐఏఎస్ అధికారి జయేశ్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో యూకేకు చెందిన కంపెనీలు సైతం సీఈవో పదవిని ఆఫర్ చేస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జపాన్, కొరియా, కెనడా, సింగపూర్ కంపెనీలు సైతం ఇప్పటికే జయేశ్‌తో చర్చించినట్టు తెలిసింది. అయితే, క్యాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయంలో కీలక స్థానం ఇస్తామని ఆ సంస్థ ఆఫర్ చేసిందని, వీఆర్‌ఎస్ తర్వాత ఆయన అందులో చేరతారని ఆ వర్గాలు వివరించాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
రేషన్ బియ్యం.. బ్రాండెడ్ దందా
Read Latest AP News And Telangana News And International News And Telugu News