విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడొద్దు
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:37 AM
తెలుగు రాష్ర్టాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కేవలం జలవిద్యుదుత్పత్తి కోసమే నీటిని విడుదల చేయడం కుదరదని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తేల్చి చెప్పింది.
సాగునీటికే తొలి ప్రాధాన్యం.. ఆ తర్వాత తాగునీటి అవసరాలకు
వర్షాభావం నేపథ్యంలో శ్రీశైలం, సాగర్ నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి
రెండు రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు స్పష్టీకరణ
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కేవలం జలవిద్యుదుత్పత్తి కోసమే నీటిని విడుదల చేయడం కుదరదని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లోని 12వ షెడ్యూల్ ప్రకారం.. విద్యుదుత్పత్తి కంటే సాగు నీటి అవసరాలకు, సాగునీటి కంటే తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలను అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేసింది. ఈ నెల 4న జలసౌధలో కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి సతీశ్ కాంబోజ్ అధ్యక్షతన త్రిసభ్య కమిటీ భేటీ జరగ్గా.. నాటి సమావేశం వివరాలను (మినిట్స్) రెండు రాష్ర్టాలకు బోర్డు పంపించింది. వీటి ప్రకారం.. సెప్టెంబరు 2026 నుంచి ఆగస్టు 2027 మధ్యకాలంలో ఉమ్మడి జలాశయాల నుంచి ఇరు రాష్ట్రాలకు సాగునీటి కేటాయింపులపై ఏకాభిపాయ్రం కుదరలేదు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే 21వ కృష్ణాబోర్డు సమావేశంలో దీనిపై చర్చించాలని నిర్ణయించారు. కాగా, సమావేశంలో జరిగిన వాస్తవ చర్చల వివరాలేవీ ఈ మినిట్స్‌లో ప్రతిబింబించడం లేదని, వీటిని తాము అంగీకరించడం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్) రమేశ్‌బాబు కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. కాగా, తాగునీటి సరఫరా, చెరువులను నింపడానికి సెప్టెంబరు 2026 నుంచి ఆగస్టు 2027 వరకు తమ రాష్ర్టానికి 104 టీఎంసీల నీళ్లు అవసరమని ఏపీ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ బోర్డుకు తెలిపారు. సెప్టెంబరు 3 నాటికి ఉన్న నీటి నిల్వలను ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో పంపిణీ చేేస్త.. ఆ మేరకు ఏపీకి రావాల్సిన 97.41 టీఎంసీలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అయితే, రెండు రాష్ట్రాల మధ్య 50:50 నిష్పత్తిలోనే నీటి పంపిణీ జరగాలని తెలంగాణ ఈఎన్‌సీ (జనరల్) డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
హ్యామ్ రోడ్లకు హడ్కో రుణం
టీవీ9 షేర్ల బదిలీ కేసులో రవి ప్రకాశ్‌కు నిరాశ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News